నటి ప్రణీత కన్నడ పిల్ల. అయితేనేం మాతృభాషతో పాటు తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ….ఇప్పుడిప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ అందాల రాశి సాధ్యమైనన్ని సినిమా అవకాశాలు దక్కించుకోవాలని పరితపిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి రక్షణ పొందేందుకు అవగాహన, చైతన్యం పెంపొందించేందుకు సెలబ్రిటీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
బహుభాషా నటి ప్రణీత మాత్రం హిందూ జీవనం విధానం ద్వారా కరోనాకు ఎలా దూరం ఉండొచ్చో విడమరిచి చెబుతోంది. నిజంగా ప్రణీతలోని ఈ అవగాహనకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇంతకూ ఆమె ఏం చెబుతున్నారంటే…
ఎవరైనా పరిచయస్తులు లేదా పెద్దవాళ్లు కనిపిస్తే షేక్‌హ్యాండ్ ఇస్తారని, అదే హిందూ సంప్రదాయమైతే నమస్కరించాలని సూచిస్తుందని చెప్పారామె. అయితే హిందువులు రెండు చేతులతో నమస్కరించడం చూసి ఇతరులు నవ్వుకున్నారన్నారు. అలాగే బయట నుంచి ఇంట్లోకి వెళ్లేముందు చేతులు, కాళ్లు కడుక్కోవడం చూసి నవ్వుకున్నారన్నారు. హిందువులు శాఖాహారాన్ని భుజించడం చూసి, యోగా చేయడం చూసి కూడా ఇతరులు నవ్వుకున్నారన్నారని ఆమె వాపోయారు.
అంతేకాదు, శవాలను దహనం చేయడాన్ని చూసి నవ్వుకున్నారని, అంత్యక్రియల్లో పాల్గొన వారు తరువాత తలారా స్నానం చేయడాన్ని చూసి నవ్వుకున్నారని ఆమె తెలిపారు. నిన్నమొన్నటి వరకు మన సంప్రదాయాలను, జీవన విధానాలను చూసి నవ్వుకున్న వాళ్లే, నేడు ఆలోచిస్తుండటం హిందుత్వ గర్వకారణమన్నారు.
కావున ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉందన్నారు. ఈ అలవాట్లే కరోనాను వ్యాప్తి చెందకుండా చేస్తోందన్నారు. హిందుత్వం అనేది మతం కాదని, జీవన బాట అని తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ విలువైన విషయాలను ప్రణీత ట్విటర్‌లో వెల్లడించారు. మొత్తానికి పాశ్చాత్య మోజులో మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరిస్తూ….సరికొత్త రోగాలను తెచ్చుకుంటున్న తాజా పరిస్థితుల్లో ప్రణీత వల్లె వేసిన విధానాలు ఎంతైనా ఆచరణీయం, అనుసరణీయం. మంచి విషయాలను చెప్పి జ్ఞానోదయం కల్పించిన ప్రణీతకు నిజంగా ప్రణమిల్లాల్సిందే.