ఆ కుటుంబానికి ఎంతో కష్టం వచ్చి ఉంటుంది. లేదంటే అలా సామూహికంగా అత్మహత్యకు పాల్పడరు. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి వ్యవసాయ బాలిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లెలో గ్రామ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో సదరు మహిళ తన పిల్లలతో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. వాళ్లు 3 రోజుల కిందటే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది.
నిన్న సాయంత్రం బావి దగ్గరకు వచ్చిన ఓ గొర్రెల కాపరి ఈ మృతదేహాల్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు మృతదేహాల్ని బావి నుంచి బయటకు తీశారు. పుంగనూరి ప్రభుత్వాసుపత్రికి భౌతికకాయాల్ని తరలించారు. తల్లితో పాటు ఆరేళ్ల కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు గుర్తించారు.
అయితే వీళ్లంతా ఎవరు అనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్థారించలేకపోతున్నారు. తమ గ్రామస్తులు మాత్రం కాదని ప్రసన్నయ్యగారిపల్లె వాసులు చెబుతున్నారు. ఏదో ప్రాంతం నుంచి ఇక్కడికొచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.