పొద్దున్నే సెల్ఫోన్ చూడాలంటే భయమేస్తోదని సినీ నటి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి వాపోతున్నారు. తనను పోకిరీల అసభ్య చేష్టల నుంచి రక్షించాలని ఆమె పోలీసులను వేడుకుంటున్నారు. గత కొంత కాలంగా నరకం అనుభవిస్తున్నట్టు ఆమె చెబుతున్నారు.
‘ఎవరికీ చెప్పుకోలేని బాధ. అసభ్య పదజాలంతో దూషణలు. అశ్లీల వీడియోలు పంపుతూ మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఉదయాన్నే ఫోన్ చూడాలంటే భయం. ఎవరేం పంపి ఉంటారోననే ఆందోళన. గత కొన్ని రోజులుగా ఈ బాధను భరించలేకున్నా’ అని నటి కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎవరో అపరిచిత వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని, ఆ నంబర్లను బ్లాక్ చేసినప్పటికీ, కొత్త నంబర్ల నుంచి పంపుతున్నారని ఆమె తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, అంతేకాకుండా తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేస్తున్నారని నటి కళ్యాణి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. తనను మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను అభ్యర్థించారు.