సరదాలకు ఒక సమయం, సందర్భం ఉంటాయి. అవేవీ చూసుకోకుండా సరదాలంటూ ఊళ్లు పట్టుకుని తిరిగితే మాత్రం తిప్పలు తప్పవు. కరోనా విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా తమిళ నటులు విమల్, సూరి (కమెడియన్)లకు సరదా ట్రిప్ చిక్కులు తెచ్చింది.
లాక్డౌన్ కారణంగా ఇంట్లో కూచొని కూచొని బోర్‌గా ఫీల్ అయిన విమల్, సూరి…కాస్తా రిలాక్స్‌గా ఎక్కడికైనా వెళ్లి వస్తే బాగుం టుందని భావించారు. దీంతో ఇద్దరూ కలిసి ఇటీవల కోడైకెనాల్‌కు సరదా ట్రిప్ వేశారు. ఒకవేళ పోయారే అనుకుందా…పద్ధతులు పాటించాలి కదా! అబ్బే తాము సెలబ్రిటీలనుకుని, అలాంటివేవీ వర్తించవని నమ్మినట్టున్నారు.
కోడైకెనాల్‌లోని నిషిద్ధ ప్రాంతానికి వెళ్లి…అక్కడ ఒక కొలనులో చేపలు పట్టారు. దీంతో తమ సరదా తీరిందని సంబరపడ్డారు. పాపం తర్వాత వచ్చే చిక్కులు గురించి అంచనా వేయలేక పోయారు. ఈ ఇద్దరు నటులు నిషిద్ధ ప్రాంతంలో ఉన్నారని అటవీశాఖ అధికారులకు తెలిసింది. దీంతో అటవీ అధికారులు అక్కడికి వచ్చి సినిమా నటులైతే తమకేం అంటూ, చీవాట్లు పెట్టారు. అంతేకాదు ఫైన్ కూడా విధించారు. నటులు విమల్, సూరి చెల్లించారు.
తప్పునకు శిక్ష అనుభవించామని సరిపెట్టుకున్న ఆ ఇద్దరు నటులకు…పోలీసుల రూపంలో కొత్త సమస్య వచ్చింది. కోడైకెనాల్‌లో నిబంధనలు పాటించకపోవడంతో పాటు ఈ-పాస్ తీసుకోకుండా ప్రయాణించిన నేరం కింద నటులిద్దరిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వీళ్లకు కొడైకెనాల్లో సహకరించిన వారెవరని పోలీసులు దర్యాప్తు చేయగా…ఓ వ్యక్తి గురించి తెలిసింది.
కొడైకెనాల్‌కు చెందిన ఖాదర్‌బాషా వీరిద్దరికి కార్లను సరఫరా చేయడంతో పాటు గదిని ఏర్పాటు చేసినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. అనంతరం నటులిద్దరితో పాటు ఖాదర్‌బాషాపై కూడా కొడైకెనాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి నటుల సరదా పర్యటన సినిమాను తలపించే కథ నడిచింది.