మొదట డీఎంకే, అక్కడ పడక కాంగ్రెస్ లో చేరిన నటి కుష్బూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తోందట! కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే అధికారంలోకి వచ్చేదీ లేదు. తమిళనాడులో అయితే అధికార పక్షంలో భాగస్వామి కాగలదేమో కానీ, అధికారం ఛాన్సు లేదు. మరోవైపు వచ్చే వారందరికీ 'వాంగో..వాంగో.. ' అంటోంది తమిళనాడు బీజేపీ. ఇలాంటి నేపథ్యంలో కుష్బూ భారతీయ జనతా పార్టీ లోకి చేరబోతోందనే పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి.
కుష్బూ మాట్లాడే మాటలకు, ఆమె ఎదిగిన నేపథ్యానికి, ఆమె కుటుంబ నేపథ్యానికి.. ఇలా ఎలా చూసినా బీజేపీ సూటయ్యే పార్టీ కాదు. అయితే రాజకీయాల్లో ఎవరు ఎలాంటి వేషాలు అయినా వేయగలరు కదా, ఈ క్రమంలో కుష్బూ బీజేపీలోకి చేరబోతోందనే వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి డీఎంకేలో కుష్బూ ఖుషీగానే ఉండేది. స్టాలిన్- అళగిరిల గొడవ గురించి కామెంట్ చేసి ఆమె కరుణానిధి ఆగ్రహానికి గురయ్యింది, ఇప్పుడు కరుణానిధి లేరు, డీఎంకేలో అళగిరి అలజడి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆమె డీఎంకే లోకి తిరిగి వెళ్లాల్సింది, అయితే అక్కడ ఆమె అహం దెబ్బతిందో ఏమో కానీ, కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తోంది. అయితే కాంగ్రెస్ లో కుష్బూను నేతగా ఒప్పుకోరు, మరోవైపు నగ్మా పోటీ వస్తూ ఉంటుంది. కాంగ్రెస్ కు అధికారం సుదూరంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తూ కుష్బూ చేసిన ప్రకటనతో ఆమె బీజేపీ వైపు చూస్తోందనే ఊహాగానాలకు మరింత ఊతం లభించింది. ఆ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. కానీ కుష్బూ సమర్థించిందట!
మొత్తానికి విద్యా విధానాల గురించి సినిమా వాళ్లు మాట్లాడితే భలే తమాషాగా ఉంటుంది. తాము తెచ్చిన విధానానికి కుష్బూ మద్దతు లభించే సరికి బీజేపీ సంతోషపడుతోందట. ఆమె పార్టీలోకి చేరితే స్వాగతం అంటోందట బీజేపీ తమిళనాడు శాఖ. విద్యా విధానం గురించి కుష్బూ స్పందించడం, ఆమెకు బీజేపీ స్వాగతం పలకడం.. రాజకీయాల్లో ఇలాంటి తమాషాలు ఉంటేనే జనాలకూ అప్పుడప్పుడు రిలీఫ్!