భ్రమరావతి

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే….నిబిడాశ్చర్యంతో వీరు…నెత్తురు కక్కుకంటుూ నేలకు నే రాలిపోతే….నిర్దాక్షిణ్యంగా వీరే…అంటాడు కవి శ్రీశ్రీ. Advertisement అమరావతి అనే నవనగర ఆవిష్కరణ ప్రణాళిక ఉవ్వెత్తున హడావుడి చేసినపుడు, చప్పున చల్లారిపోయినపుడు, ఈ రెండు…

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే….నిబిడాశ్చర్యంతో వీరు…నెత్తురు కక్కుకంటుూ నేలకు నే రాలిపోతే….నిర్దాక్షిణ్యంగా వీరే…అంటాడు కవి శ్రీశ్రీ.

అమరావతి అనే నవనగర ఆవిష్కరణ ప్రణాళిక ఉవ్వెత్తున హడావుడి చేసినపుడు, చప్పున చల్లారిపోయినపుడు, ఈ రెండు వాక్యాలు గుర్తుకు వస్తాయి. కృష్ణా, గుంటూరు రెండు జిల్లాల వారు తప్ప, మిగిలిన ఆంధ్ర జనాలు అందరూ ఇలా నిబిడాశ్చర్యంతో చూసారు. నిర్దాక్షిణ్యంగా బాబును ఓడించారు. ఇప్పుడు ఆ రెండు జిల్లాల జనాలు నిట్టూరుస్తున్నారు.

అమరావతి అనే ఊహాజనిత నగరం మఘలో పుట్టి పుబ్బలో మాడిపోవడానికి కారణం ఏమిటి? ఎవరు?

అసలు అమరావతి ముందు వెనుక ఏం జరిగింది?

గడచిన అయిదేళ్లలో అమరావతే రాజధానిగా అభివృద్ది చెందిందా? అమరావతి పేరు చెప్పి విజయవాడ, పరిసర ప్రాంతాలను అభివృద్ది చేసే ప్రయత్నం జరిగిందా? అమరావతి విషయంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే తెలుగుదేశం అధినేత కాస్త అతికి లేదా అత్యాశకు వెళ్లారా? లేదా ఆయనను ఆ దిశగా ఎవరైనా నడిపించారా? రాష్ట్రంలో అన్ని విధాలా బలంగా వున్న ఓ సామాజిక వర్గం, తెరవెనుక అన్నీ తానై చంద్రబాబు చేత చేయించిన తప్పిదాలే ఈ రోజు చంద్రబాబు ఓటమికి, అమరావతి పతనానికి దారితీసిందా? ఈ ప్రశ్నలకే కాదు, ఇలా అనేకానేక ప్రశ్నలకు అవును అన్నదే సమాధానం అవుతుంది.

అసలు ఏమిటీ అమరావతి?

రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఎక్కడ అన్నపుడు తెరపైకి అనేకానేక డిమాండ్లు వచ్చి వుండొచ్చు కానీ గట్టిగా వినిపించిన పేర్లు రెండే. ఒకటి విశాఖ. మరొటికి విజయవాడ. ఎప్పటి నుంచో ఆంధ్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా విజయవాడ వుంది. తెలుగునాట అన్ని విధాలా బలమైన ఓ సామాజిక వర్గానికి కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆత్మగా వున్నాయి.  దాంతో పెద్ద వ్యూహానికి తెరలేచింది. కృష్ణా జిల్లాకు రాజధాని వచ్చేలా చేసేందుకు మాస్టర్ ప్లాన్ రచన తయారైంది. ఇక్కడే రెండు రకాల ప్రయోజనాలు సిద్దించేలా వ్యూహం పన్నారు.

ఒకటి తమది అని శతథా, సహస్రథా భావించే కృష్ణ జిల్లాకు రాజధాని రావాలి. రెండవది సైబరాబాద్ ఏర్పాటులో ఏ విధంగా భూములు ముందుగా సంపాదించి ప్రయోజనం పొందారో అలాంటి వ్యవహారం ఇక్కడా జరగాలి. ఇక్కడే అమరావతి అనే కొత్త వ్యూహాత్మక నగరానికి తెరలేచింది. విజయవాడ అంటే మిగిలిన ఏరియాల వారు ఫీలవ్వచ్చు. సెంటిమెంట్ గా ఉత్తరాంధ్ర వారో, రాయలసీమ వారో ఇబ్బందిగా భావించవచ్చు. అందుకే కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఉభయకుశలోపరిగా వుండే విధంగా అమరావతి అనే ప్రాంతాన్ని సృష్టించడానికి శ్రీకారం చుట్టారు.

భూముల వ్యాపారం

కూరలు సమృద్దిగా పండేవి, పసుపు, మిర్చి, వరి వగైరా మాంచి పంటలు పండేవి అయిన సారవంతమైన భూముల్లో అమరావతి నగరాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. తమ సెంటి మెంట్ ను ప్రతి ఫలించేలా నామకరణం చేసారు. నిజానికి రైతులు ఆవేళ ఉద్యమించాల్సి వుంది. కొంత మంది ఉద్యమించారు కూడా. సారవంతమైన భూములను కాంక్రీట్ కట్టడాలుగా మార్చేస్తే, తినడానికి ఏమి వుంటుంది? అని. కానీ తెరవెనుక జరిగిన అనేకానేక మంతనాల ఫలితంగా,  రైతులు తమ భూములను 'డెవలప్ మెంట్' కు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.  అదే సమయంలో అమరావతి ప్రాంతంలో బడా బాబులు ఎవరి శక్తి కొలది వాళ్లు కొనుగోళ్లు జరిపారు. ఇలా కొనుగోళ్లు జరిపిన వారికి ఇబ్బంది లేకుండా, అమరావతి హద్దులు, ఎల్లలు నిర్ణయమయ్యాయి.  రైతులకు కౌలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చే వరకు కౌలు, డెవలప్ చేసి ఇచ్చాక, కావాలంటే వుంచుకోవచ్చు. లేదా అమ్ముకోవచ్చు. ఇదీ స్థూలంగా స్కీము. ఇది ఒక విధంగా త్యాగం, ఓ విధంగా లాభం.

సారవంతమైన తమ భూములను ఇష్టం లేకున్నా, డెవలప్ మెంట్ ఇవ్వడం త్యాగం.  ఎందరూ వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో వుంటూ, ఇక్కడ భూములు కౌలుకు ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చారు. డెవలప్ మెంట్ జరిగితే మంచి రేట్లు వస్తాయి. ఓ విధంగా అది ముందు చూపు. ఎంత ముందు చూపు అంటే, అమెరికా లాంటి దేశాల్లో వున్న పలువురు, పనిగట్టుకుని, ఇక్కడకు వచ్చి, భూములు కొని మరీ ప్రభుత్వానికి ఇచ్చేంత ముందు చూపు.

కొనుగోలు చేసి ఇచ్చారు

సాధారణంగా ప్రభుత్వం మన భూములు అక్వైర్ చేస్తుంది అంటే ఎలాగోలా తప్పించుకోవాలనుకుంటారు అందరూ. కానీ అమరావతిలో ఎదురు వెళ్లి మరీ భూములు కొని ప్రభుత్వానికి ఇచ్చారు అంటే కారణం ఏమిటి? ఇదే అడిగాను నేను అమెరికాలో వుండే ఓ మిత్రుడిని. ఎక్కువరేటు పెట్టి కొని మరీ ప్రభుత్వానికి ఇవ్వడం ఏమిటి? అని. దానికి ఆ మిత్రుడి సమాధానం ఇలా వుంది.

''..ఇప్పుడు కావాలి  అంటే హైదరాబాద్ పంజాగుట్టలో స్థలం కొనగలమా? అమరావతి పదేళ్ల తరువాత అలా వుంటుంది. ఆ వేళకు మనకు అలాంటి కీలకమైన స్థానంలో కమర్షియల్ స్థలం వుంటుంది..అదీ ఆలోచన..'' అన్నారు.

ఫలానా చోట స్థలం అని ఎలా ఫిక్స్ అవుతారు. ఇదంతా లాటరీ లాంటి వ్యవహారాలతో కూడినది కదా? అని నేను ప్రశ్నిస్తే, మళ్లీ వచ్చిన సమాధానం ఇలా వుంది. ''..అక్కడే మనకు పార్టీ వాళ్లు సాయం చేసేది…'' అప్పుడు అర్థం అయింది అమరావతి అనే నవనగర నిర్మాణం వెనుక వున్న భూముల వ్యాపార పరమార్థం.

ఛలో విజయవాడ

ఈలోగా మరో అంకానికి తెరలేచింది. అమరావతి పేరు చెప్పి విజయవాడను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం.  చంద్రబాబు వున్న అయిదేళ్లలో పత్రికల్లో డేట్ లైన్ కు మాత్రమే అమరావతి. అయిదేళ్లలో అక్కడ చేయగలిగింది ఓ తాత్కాలిక సచివాలయం, హైకోర్టు భవనం మాత్రమే.  ఇక మిగిలినది అంతా విజయవాడ, మంగళగిరి ప్రాంతాలే.  మంత్రుల భవనాలు ఎక్కడ? మంత్రుల కార్యాలయాలు ఎక్కడ? వివిధ శాఖల కీలక అధిపతులు ఎక్కడ వున్నారు? ఇలా ఒకటేమిటి? అన్నీ అమరావతి బయట, ముఖ్యంగా విజయవాడలోనే.  కీలకమైన సంస్థలు అన్నీ కొలువు తీరాయి. ఆఖరికి విశాఖకు ఐటి అని చెబుతూనే, మంగళగిరి ప్రాంతంలో ఐటిని అభివృద్ధి చేసే పనికి శ్రీకారం చుట్టారు.

ఒక దశలో విశాఖ రైల్వే జోన్ ను కూడా గుంతకల్ జోన్ తో కలిపి, విజయవాడ కేంద్రంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ తెలుగుదేశం నాయకుల నోటి వెంట వచ్చింది.  విభజనలో భాగంగా ఎయిమ్స్ ను కేటాయించినపుడు కర్నూలులో స్థలం చూస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా మంగళగిరికి తరలిపోయింది. ఇలా ప్రతి ఒక్కటి విజయవాడ-గుంటూరు ప్రాంతాలనే కేరాఫ్ అడ్రస్ చేసుకున్నాయి.  బెంగళూరుకు దగ్గరగా వుండడం వల్ల అనంతపురం వద్ద కియా మోటార్స్, చెన్నయ్ కు దగ్గరగా వుండడం వల్ల శ్రీసిటీకి పరిశ్రమలు అనివార్యంగా వచ్చాయి. లేదూ అంటే ఏ మాత్రం అవకాశం వున్నా, అవి కూడా కృష్ణా జిల్లాకు తరలిపోయేవి.

కబుర్లు బోలెడు

నిజానికి రాజధానిని అమరావతికి ప్రకటిస్తున్నపుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చదవిన పత్రం ఓ సారి గుర్తు తెచ్చుకోవాలి. ఆయన మొత్తం 13 జిల్లాలకు ఏమేం చేయబొతున్నారో, ఏమేం ఇవ్వబోతున్నారో ఓ సుదీర్ఘ ప్రసంగం చేసారు. ఈ ప్రసంగ పాఠం ఎక్కడో అక్కడ వుండే వుంటుంది. అది చూస్తే భలే గమ్మత్తుగా వుంటుంది. శ్రీకాకుళం నుంచి కడప, కర్నూలు వరకు వరాలే వరాలు. ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు, ఇలా ఒకటేమిటి అనేకానేకం ప్రకటించారు.  

ఇప్పుడు ఆ ప్రసంగ పాఠం, ఆ వరాల వైట్ పేపర్ ఎక్కడన్నా దొరికితే ఎవరన్నా చదువుకుంటే అర్థం అవుతుంది జనాలకు చంధ్రబాబు ఏ విధంగా మాయ చేసారో? ఆ రోజు అమరావతి ప్రకటిస్తుంటే మిగిలిన ప్రాంతాల ప్రజలు ఏం ఫీల్ అవుతారో అని బోలెడు కబుర్లు చెప్పి, బోలెడు హామీలు ఇచ్చారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి అన్నా అమలు అయి వుంటే పరిస్థితి వేరుగా వుండేది.

చంద్రబాబు తప్పిదం అదే

నిజానికి చంద్రబాబు తప్పిదం అదే. అయిదేళ్లలో అమరావతి మీద వ్యూహరచన మినహా ఆచరణ అన్నది శూన్యమైంది. అప్పట్లోనే ఎయిమ్స్ నో, హై కోర్టునో కర్నూలుకు కేటాయించి, విశాఖకు సెకండ్ క్యాపిటల్ లేదా సమ్మర్ క్యాపిటల్ లాంటి హోదా ఇచ్చి వుంటే, ఇప్పుడు అమరావతికి ఈ గతి పట్టేది కాదు. ఎంతసేపూ అమరావతిని ఏ విధంగా అద్భుతమైన నగరంగా మార్చాలనే కలలు, వ్యూహాలు తప్ప, రాయి మీద రాయి, ఇటుక మీద ఇటుక కట్టుతూ వెళ్లాలన్న ఆలోచన చేయలేదు.

అదే సమయంలో అమరావతి జపమే చేస్తూ వుంటే మిగిలిన 11 జిల్లాల జనాలు ఎలా భావిస్తూ వుంటారన్నది ఆలోచించలేదు. ఆ జిల్లాలకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వరాలను మరిచిపోయారు. కనీసం ఒక్కో జిల్లాకు ఒక్కోవరం నెరవేర్చినా, లేదా కనీసం విశాఖ ఎయిర్ పోర్టు, విశాఖ మెట్రో లాంటివి చేసి వున్నా, పరిస్థితి వేరుగా వుండేది.  అయిదేళ్ల పాటు చంద్రబాబు హయాంలో అమరావతికి అది..అమరావతికి ఇది అనే వార్తలు చదివి చదివి జనం బోరెత్తిపోయారు. మనకేమీ లేదా? అనే ఆలోచన వుదయించి చాలా సైలంట్ గా దెబ్బ కొట్టేసారు.

ఇప్పుడు కూడా అదే తప్పిదం

చంద్రబాబు ఇప్పుడు కూడా అదే తప్పిదం చేస్తున్నారు. అమరావతి ఉద్యమం, అమరావతి రైతులు, అమరావతి రాజధాని అంటూ నానాయాగీ చేస్తున్నారు. అదే సమయంలో రాయలసీమ వాసుల, ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ ఆర్డినెన్స్ మీద సంతకం చేసే సరికి ఉత్తరాంధ్ర వాసుల్లో, సీమ ఏరియాలో బలమైన సెంటిమెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రయత్నాలను కోర్టుల ద్వారా బాబు అడ్డుకోవచ్చు. కానీ అది తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికల్లో ఆత్మహత్యా సదృశ్యంగా మారుతుంది అన్నది వాస్తవం. వైకాపాకు కృష్ణ, గుంటూరు జిల్లాల మీద ఎలాగూ ఆశ వుండదు. మిగిలిన 11 జిల్లాల మీదే దృష్టి.  కానీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు జిల్లాల కోసం మిగిలిన 11 జిల్లాల్లో పార్టీని బలిపెట్టుకుంటోంది. అమరావతి మీద ఉద్యమం చేస్తూనే, మిగిలిన జిల్లాల వారికి లాజికల్ సమాధానం ఇచ్చే పరిస్థితి చంద్రబాబులో కనిపించడం లేదు.

బొమ్మ అయినా బొరుసు అయినా

రాజధాని వికేంద్రీకరణ కనుక ఏ ఆటంకమూ లేకుండా సజావుగా సాగిపోతే అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర వాసుల్లో జగన్ హీరో అయిపోతారు. లేదూ కోర్టుల ద్వారానో, మరో విధంగానో అడ్డుకుంటే అదే సీమ, ఉత్తరాంధ్ర వాసుల్లో చంద్రబాబు విలన్ గా మిగిలిపోతారు. ఇలా రెండు విధాలా చంద్రబాబుకు నష్టమే తప్ప లాభం లేదు. ఏ అమరావతి తన కీర్తి ప్రతిష్టలను భూమ్యాకాశాలు వున్నంతకాలం నిలబెడుతుందని, అమరావతి పట్టణాన్ని చంద్రబాబు నాయుడు నిర్మించెను అని భవిష్యత్ పాఠ్యపుస్తకాల్లో పిల్లలు చదువుకుంటారని ఆయన కలలు కన్నారో, అదే అమరావతి ఆయన రాజకీయ కార్యాచరణను, రాజకీయ భవిష్యత్ ను, తెలుగుదేశం పార్టీ అధికార సాధనను ప్రభావితం చేయడం విధి వైపరీత్యం మాత్రం కాదు. చంద్రబాబు స్వయంకృతాపరాధం.

చాణక్య
[email protected]