విశాఖ సినీ రాజధాని అని మెప్పుకోలుకు అంటారు. కానీ కనీసం ఆ వైపుగా మౌలిక సదుపాయాలను పాలకులు కల్పించరు. మరోవైపు విశాఖలో భూములు కావాలి కానీ ఇక్కడకు వచ్చి స్టుడియోలు కట్టి పరిశ్రమను పెట్టాలంటే మాత్రం సినీ పెద్దలకు అసలు ఇష్టం ఉండదు. మొత్తానికి ఇలా రెండు వైపుల నుంచి జనాలకు సినిమా చూపించేస్తున్నారు.
విశాఖలో షూటింగులు ఎక్కువగా జరుగుతాయి. అది ఇవాళా నిన్నా ముచ్చట కాదు, 1960 దశకం నుంచి అది మొదలైంది. స్వర్ణయుగం నటుడు అక్కినేని నాగేశ్వరరావు కులగోత్రాలు సినిమాతో విశాఖ అందాలు వెండితెరను పరచుకున్నాయి. ఆ తరువాత ఎందరో విశాఖ సోయగాలతో సొమ్ము చేసుకున్నారు.
1990 దశకంలో చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అవుతుందన్నపుడు కూడా విశాఖ పేరు గట్టిగా వినిపించింది. అయితే హైదరాబాద్ లోనే చివరికి సెటిల్ అయింది. విభజన తరువాత మళ్ళీ విశాఖకు టాలీవుడ్ అంటూ గట్టిగానే ప్రచారం సాగినా బడా నిర్మాతలు, పెద్దలు హైదరాబాదే ముద్దు అంటూ వచ్చారు.
ఇపుడు విశాఖకు రాజధాని అంటూంటే కొందరు సినీ అగ్రజులు జై కొడుతున్నారు. మరి కొందరు అలా వస్తే తమ భూములకు రేట్లు పెరుగుతాయని ఆశపడుతున్నారు. అంతే తప్ప విశాఖలో స్టూడియోలు కట్టి షూటింగులు పెట్టి స్థానికులకు ఉపాధిని ఇవ్వాలన్న ఆలోచన మాత్రం ఎవరికీలేదు.
విశాఖలో సినిమా ఫంక్షన్లు ఎక్కువగానే జరుగుతాయి. ఇలా ఫంక్షన్లు జరిగిన ప్రతీసారీ విశాఖకు చిత్ర పరిశ్రమను తెచ్చేస్తామని సినీ పెద్దలు ప్రకటనలు చేస్తారు. విశాఖకు పరిశ్రమ వస్తే అన్నీ దగ్గరుండి చేస్తామని రాజకీయ పెద్దలో ఆర్భాటం చేస్తారు. అంతటితోనే ఆ ముచ్చట అలా ముగిసిపోతోంది.
నిజానికి విశాఖ అందాల మీద ప్రేమా…లేక ఇక్కడ భూముల మీద మోజా …కాదంటే ఇక్కడ జనం అమాయకత్వం మీద అతి నమ్మకమా అన్నది తెలియదు కానీ విశాఖకు సినీ పరిశ్రమ రాదూ, రాలేదూ అన్నది మాత్రం తేలిపోతోంది. ఇది కూడా మరో అమరావతి కధే. ఇక్కడ భూములున్న వారు విశాఖ సినీ రాజధాని కావాలంటారు. లేనివాళ్ళు ఈ గోల మాకెంటి అంటూ తప్పుకుంటారు ఇదీ విశాఖ సినీ రాజధాని అసలు కధ.