వివాదాస్పద ఆధ్యాత్మిక గురవు నిత్యానంద పరిస్థితి చిక్కడు, దొరకడు అనే చందాన తయారైంది. ఆయనపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికీ చక్కగా దేశం విడిచి పారిపోయాడు. ఇప్పుడు ఆయన్ను పట్టుకురావాలని న్యాయస్థానాలు ఆదేశిస్తే…పోలీసులు కైలాసం వైపు చూడాల్సిన దుస్థితి.
నిత్యానంద…పేరులోనే కాదు జీవితంలో కూడా ఆనందాన్ని తనివి తీరా పొందుతున్నాడు. పేరుకే ఆధ్యాత్మికం…ఆచరణలో మాత్రం శృంగార జీవితం. శృంగార సాగరంలో గజ ఈతగాడు నిత్యానంద. ప్రస్తుతం కైలాసంలో కొలువుదీరి, పాత జీవితాన్నే కొత్తగా ప్రారంభించాడు.
ఇదిలా ఉంటే దేశం విడిచి పారిపోయిన ఆ వివాదాస్పద గురవు నిత్యానంద గురించి కర్నాటక పోలీసులు హైకోర్టుకు చెప్పిన సమాధానం వింతగొల్పుతోంది. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉండటంతో ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానం ఎదుట కర్నాటక పోలీసులు చేతులెత్తేశారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడు.
2010లో ఆయనపై కేసులు, రెండుసార్లు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుల విషయమై రామనగర్‌లోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొన్నాడు. బెయిల్‌పై బయటకి వచ్చాడు. బాలికలను అపహరించి శృంగార కార్యకలాపాల నిమత్తం వేధించిన ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద 2018లో దేశం విడిచి పరారయ్యాడు. దక్షిణ అమెరికాలో ఒక ద్వీపంలో సొంత దేశం ఏర్పాటు చేసుకున్నాడు.
దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌కు సమీపంలో ఉందా దేశం. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్ నుంచి సొంతానికి కొన్న నిత్యానంద …ఆ దీవిలో సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సొంత జెండా, సొంత పాస్‌పోర్ట్, సొంత జాతీయ చిహ్నం, సొంత రాజ్యాంగం….ఇలా అన్నీ సొంతం ఏర్పాటు చేసుకున్న విలాసపురుషుడు నిత్యానంద.
ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో ‘కైలాస’ అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు ప్రకటనలు విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది.
2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఆయన లేరు. ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని, నిత్యానంద ఆధ్యాత్మిక టూర్లో ఉన్న కారణంగా న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని పోలీసులు వెల్లడించారు. నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక టూర్లో ఉన్నారని పోలీసులు చెప్పడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.