హైకోర్టులో జగన్ సర్కార్‌కు వరుస దెబ్బలు పడుతున్నాయి. తాజాగా విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్‌కు తరలించడాన్ని సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రాజధాని తరలింపుపై పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కార్యాలయాల్ని ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ తెలిపాడు. అలాగే ఈ నెల 26వ తేదీ వరకు కార్యాలయాల తరలింపుపై స్టే విధించినట్టు హైకోర్టు తెలిపింది.
గత శుక్రవారం అర్ధరాత్రి కర్నూల్‌కు విజిలెన్స్‌కు సంబంధించి కార్యాలయాల తరలింపునకు సంబంధించి జగన్ సర్కార్ జీవో ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు పిటిషనల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు దీనిపై స్టే విధించడంతో.. ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇటీవల హైకోర్టులో జగన్ సర్కార్‌కు పదేపదే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను కొట్టడంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఆ రెండింటిపై హైకోర్టు ఏమన్నదంటే…
‘ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీ కార్యాలయాకు రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారు ( రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసింది). స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మీ పనే కదా, అందుకే కదా మీరున్నది. రెండు వారాల్లో రంగులను తొలగించాల్సిందే’
‘ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్య పుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఈ వ్యవహారంపై ముందుకెళితే ఆ ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచే రాబడతాం. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉంది’ అని హైకోర్టు సీరియస్‌గా వ్యాఖ్యానించింది.
ఇప్పటికైనా జగన్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు అన్ని రకాలుగా ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. అలా కాకుండా గుడ్డిగా, మొండిగా ముందుకెళితే న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తినక తప్పని పరిస్థితి. ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా విచక్షతో జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని, తీసుకోవాలని ఆశిద్దాం.