ఆంధ్రప్రదేశ్లో రాజధాని వ్యవహారం రాజకీయ వేడిని రాజేసిన విషయం విదితమే. ఆ సెగల్లో భారతీయ జనతా పార్టీ కూడా చలికాచుకుంటోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం.. ఒకటి కాదు, మొత్తంగా మూడు రాజధానులు వుండాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన. ఈ మేరకు అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం జరిగింది కూడా.! అమరావతితోపాటుగా మరో రెండు రాజధానులుగా విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్ని ఆ తీర్మానంలో ప్రతిపాదించింది వైఎస్ జగన్ ప్రభుత్వం.
ఈ విషయమై కేంద్రం తాజాగా స్పందించింది. రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం, లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. 'రాష్ట్ర రాజధాని ఎక్కడ.? అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం' అని కేంద్రం తేల్చేసింది. మరోపక్క, 'అమరావతిని రాజధానిగా 2015లో నోటిఫై చేయడం జరిగింది' అని కూడా కేంద్రం పేర్కొంది.
ఇక్కడ, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదన్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. 'రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది..' అని సుజనా చౌదరి సహా పలువురు బీజేపీ నేతలు చెబుతూ వచ్చిన విషయం విదితమే. అదంతా ఉత్తదేనని కేంద్రం ప్రకటనతో తేలిపోయింది. అయితే, అమరావతిని 2015లో ఏపీ రాజధానిగా నోటిఫై చేయడం జరిగిందన్న ప్రకటన మాత్రం కాస్త ఆసక్తికరమైన విషయమే.
ఇప్పటిదాకా రాజధాని అమరావతిని నోటిఫై చేయలేదన్న రచ్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. 'మీరెందుకు అమరావతిని రాజధానిగా నోటిఫై చేయలేదు.?' అని టీడీపీపై, వైఎస్సార్సీపీ మండిపడుతూ వచ్చింది. దానికి టీడీపీ సరైన సమాధానం ఇప్పటిదాకా చెప్పలేకపోయింది. ఆ లెక్కన, కేంద్రం ప్రకటన టీడీపీకి కాస్త ఊరటనిచ్చే విషయమే.
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై కేంద్రం ఆలోచన ఏంటి.? 'మీడియాలో వచ్చిన కథనాల్ని చూశాం..' అని కేంద్రం ప్రకటించడంలోనే, ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రం చిత్తశుద్ధి ఏంటన్నది స్పష్టమైపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని మంటల్లో తాము కూడా చలికాచుకోవాలని కేంద్రం అనుకుంటున్నట్టుంది.