cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మతం మంటలనుంచి తప్పించుకుంటున్న సినిమాలు

మతం మంటలనుంచి తప్పించుకుంటున్న సినిమాలు

ప్రజల్లో  కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటే సమాజంలోని కొందరి ఆస్తులు దెబ్బతినడం కూడా సహజం. మనోభావాలు ఒక మోస్తరుగా దెబ్బతిన్నా ఉనికి చాటుకోవడం కోసం చట్టవ్యతిరేకమని తెలిసినా కూడా కొందరు విరుచుకుపడుతుంటారు. 

ఈ వ్యవహారంలో ఈజీగా టార్గెట్ అయ్యేది సినిమా. భావస్వాతంత్రాన్ని అనుసరించి తీసిన సినిమాల్లో తెలిసో తెలియకో కొన్ని మతాలు ప్రస్తావనకు వచ్చే సన్నివేశాలో, సంభాషణలో ఉండొచ్చు. వాటిని సాధ్యమైనంతవరకు సెన్సార్ బోర్డు హెచ్చరించి లేకుండా చేస్తుంది. కానీ ఒక్కోసారి పరిస్థితులు చేయిదాటతాయి. 

ఉదాహరణకి మూడేళ్ల క్రితం "పద్మావత్" సినిమా విషయంలో నార్త్ ఇండియాలో పెద్ద గొడవే జరిగింది. సినిమా హాల్స్ మీద దాడులదాకా వెళ్లింది.హైందవ రాణి అయిన పద్మావతిని ముస్లిం ఆక్రమదారుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ కామవాంఛతో వశపరుచునే ప్రయత్నం చేసాడన్న కథావస్తువే ఒక వర్గానికి మింగుడుపడలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయి. మతం మంటలు రాజుకున్నాయి. థియేటర్లు టార్గెట్ అయ్యాయి. 

ఈ మధ్యన "తాండవ్" అనే వెబ్ సిరీస్ లో ఒక దళిత నాయకుడు అగ్రకులానికి చెందిన స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకుని మోసం చేసిన సన్నివేశంలో ఆ స్త్రీ చెప్పిన ఒక డయలాగ్ దళితుల మనోభావాల్ని దెబ్బతీసింది. అదే సిరీస్ లో హిందూ దేవుళ్లపై అనవసరపు సన్నివేశాలు పెట్టారన్న పాయింట్ మీద హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. విషయం కోర్టుదాకా వెళ్లింది. దాడులు చేయడానికి వెబ్ సిరీస్ కి సినిమాహాల్ తో సంబంధం లేదు కాబట్టి విషయం న్యాయస్థానానికి పరిమితమయ్యింది. 

ఇక "ఫ్యామిలీ మ్యాన్-2" సిరీస్ లో సమంత ఎల్.టీ.టీ.ఈ ఉగ్రవాది పాత్ర వేస్తోందనగానే తమిళుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రిలీజ్ ఆపాలని ప్రభుత్వం ద్వారా కూడా వత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. చివరకు వివాదల మధ్యనే విడుదలయ్యింది. సమస్య సమసిపోయింది. ఇదే వెబ్ సిరీస్ కాకుండా సినిమా అయ్యుండి థియేటర్స్ లో విడుదలయ్యుంటే తమిళనాడులో ఎన్ని సినిమా హాల్స్ దాడులకి గురయ్యేవో. 

ఇప్పుడు తాజాగా "తూఫాన్" విడుదలయింది. ఇందులో హీరో పాత్ర, పాత్రధారి ముస్లిం. హీరోయిన్ పాత్ర, పాత్రధారి హిందు. లవ్ జీహాద్ పై వ్యతిరేక స్వరం వినిపించే హీరోయిన్ తండ్రి పాత్ర వేసిన పరేష్ రావల్ ఒక మతంపై తన అభిప్రాయం చెప్తూ కొన్ని విమర్శలు చేస్తాడు. చాలా బ్యాలెన్సుతో కథనం నడిపారు కాబట్టి ప్రమాదం తప్పింది. లేకపోతే ఇది కూడా గొడవల్లో నలిగి కోర్టుకెక్కేది. ఇక సినిమా హాల్స్ ఎలాగూ తెరుచుకుని లేవు కనుక దాడుల భయాలకి చాన్సే లేదు. 

కొత్తగా వచ్చిన మళయాళ చిత్రం "మాలిక్" కూడా ఇంతే. ముస్లిం, క్రైస్తవ మతాలకి చెందిన సన్నివేశాలున్నాయందులో. చాలా జగ్రత్తగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నడిపారు. అయినా ఇటువంటివి థియేటర్స్ లో విడుదల చేయడం రిస్కే. అన్నీ బాగానే ఉన్నా, సెన్సార్ అనుమతించినా ఎవరి బుర్రకి ఏ బుద్ధి పుట్టి ఏ గొడవ జరుగుతుందో తెలియదు కనుక చాలా జాగ్రత్త వహించాలి. 

ఏది ఏమైనా థియేటర్స్ కన్నా ఓటీటీలే సినిమా మేకర్స్ కి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాయి. శృతిమించనంతవరకు ఏదైనా ధైర్యంగా తీయొచ్చు. థియేటర్స్ మీద రాళ్లు పడడం, సీట్లు చిరగడం లాంటి నష్టాలు జరగవు. జనం మధ్యలోకి వెళ్లి నటీనటులు సినిమాని ప్రమోట్ చేయాల్సిన అగత్యం ఉండదు. సినిమాలకి థియేటర్స్ దొరకడంలేదన్న బాధ ఉండదు. 

కరోనా మహమ్మారి సమాజాన్ని ఎన్ని కష్టాలు పెట్టినా, సినిమారంగం విషయంలో తెచ్చిన మార్పుల్లో ఈ మార్పు స్వాగతించతగ్గదే. ఇక నెమ్మదిగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రత్యామ్నాయ వ్యాపారాలు చూసుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఇకపై థియేటర్ బిజినెస్ ముందంత లాభసాటి కానేకాదు.

స్టార్ హీరోలతో చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు

అందుకే కాంగ్రెస్ సీనియర్లు జగన్ వెంట రాలేదు

 


×