టాలీవుడ్ అగ్రహీరో, జనసేనాని పవన్‌కల్యాణ్ నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తారని, వారి సమస్యలపై ఇంకా ఏదో చేస్తారని అందరూ భావించారు. జగన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చూస్తే… ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది.
చివరికి జనసేనాని తీరు నిరుద్యోగుల్లో నిరుత్సాహం నింపింది. నిరుద్యోగుల సమస్యలపై ఆయన శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీరా కార్యాచరణ చూస్తే… తుస్సుమనిపించింది.
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు తమ పార్టీ బాసటగా నిలిచి పోరాటం చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఇంతకూ ఆయన చెబుతున్న, చేస్తున్న పోరాటం ఏందయ్యా అంటే… ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్టు పవన్‌కల్యాణ్ చెప్పారు.
రాష్ట్రంలో సుమారు 30లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టు పవన్‌కల్యాణ్ చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు జాబ్ క్యాలెండర్‌లో 10వేల ఉద్యోగాలను మాత్రమే చూపడం కచ్చితంగా యువతను వంచించడమే అవుతుందన్నారు.
ముఖ్యమంత్రి చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయిందని పవన్ నిలదీశారు. ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్‌కల్యాణ్ భావిస్తున్నప్పుడు, లక్షలాది మంది యువత తరపున పవన్‌కల్యాణ్ పోరాటం చేయాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కేవలం ఎంప్లాయిమెంట్ కార్యాలయ అధికారులకు వినతిపత్రాలతో మొక్కుబడి కార్యక్రమాలు చేయడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఏపీలో బలపడేందుకు అవకాశం ఉన్నప్పటికీ పవన్‌కల్యాణ్ చేజేతులా జారవిడుచుకుంటున్నారనేందుకు నిరుద్యోగ సమస్యపై జనసేన అనుసరిస్తున్న వైఖరిని చూపుతున్నారు. ఇప్పటికైనా పవన్‌కల్యాణ్ క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగితే తప్ప, పార్టీ బలపడే అవకాశాలు ఉండవనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు పోరాటం చేస్తావ్ పవన్‌కల్యాణ్ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.