వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్సార్‌టీపీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి పూచికపుల్ల విలువ కూడా ఇవ్వలేదాయన. ఇవాళ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రశ్నకు సమాధానంగా …కాంగ్రెస్‌ను అమ్ముడుపోయిన పార్టీగా షర్మిల అభివర్ణించారు.
షర్మిలను విస్మరించడం ద్వారా రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇవ్వాలనే ధోరణి కనిపించింది. కాంగ్రెస్‌పై షర్మిల విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. అసలు షర్మిల పెట్టినది రాజకీయ పార్టీనే కాదని కొట్టి పారేయడం గమనార్హం.
షర్మిల వ్యాఖ్యలను పట్టించు కోబోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, నేతలు మాట్లాడితే స్పందిస్తామని, షర్మిల పార్టీ ఓ ఎన్జీవో సంస్థ లాంటిదని రేవంత్‌రెడ్డి సెటైర్స్ వేశారు. అందువల్లే ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించదని తేల్చి చెప్పారు.
మీడియా ప్రతినిధులు కూడా స్పందించకుంటే తెలంగాణకు మేలు జరుగుతుందని ఆయన హితవు చెప్పారు. శుక్రవారం షర్మిలతో మీట్ ది ప్రెస్ నిర్వహించిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి మీడియాకిచ్చిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.
తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో షర్మిలకు పంచాయితీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ఆదరణ లేకపోవడంతో ఆ కోపాన్ని తమపై ప్రదర్శిస్తోందని రేవంత్‌రెడ్డి విమర్శించడం గమనార్హం.
షర్మిల పార్టీని పట్టించుకోమంటూనే, ఆమెపై చేయాల్సినన్ని విమర్శలు రేవంత్‌రెడ్డి చేయడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. షర్మిలను సీరియస్‌గా తీసుకోమని చెబుతూనే, అన్నతో తగువని, ఆమెది ఎన్జీవో అని ఇలా అనేక రకాల విమర్శలు చేయడం విశేషం. రాజకీయం అంటే ఇదే కదా!