దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరు బిడ్డలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరో పార్టీ పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఏపీలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ తన నాయకత్వాన్ని నిరూపించుకుని అధికారాన్ని దక్కించుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కారణాలేవైనా జగన్ చెల్లి షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల గుణగుణాలు, కలుపుగోలుతనం గురించి తెలుగు సమాజంలో చర్చించుకుంటున్న పరిస్థితి. ఏ రకంగా చూసినా షర్మిలకే అదనపు బలాలున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరితోనూ ఆమె ఎంతో ఆప్యాయంగా మాట్లాడ్డాన్ని జనం గుర్తు చేస్తున్నారు. అలాగని జగన్ మాట్లాడరని కాదు. ఇద్దరిలో ఎక్కువతక్కువలనే వ్యత్యాసం తప్ప, మరొకటి కాదు.
ఈ రోజు మీట్ ది ప్రెస్‌లో షర్మిల పాల్గొనడం ఆమె చొరవ, అందరితో కలిసిపోయే తత్వాన్ని తెలియజేస్తోందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. సహజంగా రాజకీయ పార్టీల అధినేతలు ప్రెస్‌మీట్లకే పరిమితం అవుతుంటారు. ఎన్నికల సమయంలో మాత్రం మీట్ ది ప్రెస్‌లో పాల్గొని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబులిస్తుంటారు.
ఇలా ఎన్నికలు లేని సమయంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నేతలు పాల్గొనరు. కానీ షర్మిల తన నివాసంలో ఇవాళ మీట్ ది ప్రెస్‌లో పాల్గొని మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా జవాబివ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
జగన్‌పై అలిగి పార్టీ పెట్టారా? ఏపీలో జగన్ పాలనలో రాజన్నరాజ్యం వచ్చిందా? తెలంగాణకు వైఎస్సార్ వ్యతిరేకి అనే ప్రచారం, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనకపోవడంపై షర్మిలను ప్రశ్నలతో ముంచెత్తారు. ఓ రాజకీయ పార్టీ అధినేత్రిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న షర్మిల ఎక్కడా ఇబ్బంది పడినట్టు కనిపించలేదు.
ఏ ప్రశ్నకూ జవాబు దాట వేయలేదు. ప్రతి ప్రశ్నకూ సూటిగా, స్పష్టంగా నవ్వుతూ ఉల్లాసంగా సమాధానం ఇచ్చారు. తన మతం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా … మతం అనేది విశ్వాసం, నమ్మకానికి సంబంధించినదని, దాంతో పనేంటని ఎదురు ప్రశ్నించారు.
ఇదే జగన్ విషయానికి వస్తే, ఆయనపై ఓ వర్గం మీడియా పనిగట్టుకుని విషపు రాతలు రాస్తుండడం తెలిసిందే. దీంతో ఆయనకు మీడియా అంటే అసలు గిట్టదనే ధోరణిలో ఉంటారు. మరీ ముఖ్యంగా తెలుగు మీడియాతో మాట్లాడేందుకు ఆయన ససేమిరా అంటారు. దీంతో కొన్ని మీడియా సంస్థలను ఆయన బహిష్కరించారు. ఇదే షర్మిల విషయానికి వస్తే… ఎవరినీ దూరం పెట్టడం లేదు. అందరితో మాట్లాడుతున్నారు. తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలకు తన విధివిధానాలపై, అలాగే తన రాజకీయ ప్రస్థానంపై ప్రజల్లోనూ, మీడియాలో ఉన్న అనుమానాలకు ఆమె స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం విశేషం. ఇదే జగన్ విషయానికి వస్తే …మీడియాతో ఆయన ఏనాడూ కలివిడిగా ఉన్న దాఖలాలు లేవు. ఒకరిద్దరు మీడియా ప్రతినిధులతో మాట్లాడ్డం తప్పితే, అందరితో ముఖాముఖి నిర్వహించిన సందర్భాలు లేవనే చెప్పొచ్చు.
మీడియా ఫ్రెండ్సీ గవర్నమెంట్ కాదని జగన్ ప్రభుత్వం ముద్ర వేయించుకుంది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అక్రిడిటేషన్ల మంజూరులో వ్యవహరించిన తీరే నిలువెత్తు నిదర్శనంగా విమర్శిస్తున్నారు. అందరితో కలిసిపోవడం తండ్రి వైఎస్సార్‌ను షర్మిల మరిపిస్తున్నారనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.