గిల్డ్ అంటారు. కౌన్సిల్ అంటారు.. కట్టు.. ఐకమత్యం అంటారు. కానీ సినిమాల విడుదల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తారు. ప్రతి సారీ ఇదే తకరారు. కాస్త మంచి డేట్ అయితే చాలు. ఎవరికి వారు రుమాళ్లు వేసేసుకుంటున్నారు.
ముందుగా చెప్పాం అని ఒకరు. తమది పెద్ద సినిమా కదా, ఎవరు ఏం చేస్తారు.. వాళ్లే వెనక్కు వెళ్తారని మరొకరు. తమ చేతిలో థియేటర్లు వున్నాయి కదా ఇంకొకరు. ఇలా ఎవరి ధీమా వారిది. కానీ దాని వలన యావరేజ్ కావాల్సిన సినిమాలు కూడా చచ్చిపోతున్నాయి.
డేట్ ల విషయంలో ముందుగా కూర్చోవడం, చర్చించడం అన్నది గిల్డ్ లో కొంత వరకు ఏర్పాటు అన్నది వుంది. కానీ అది జస్ట్ నామ మాత్రమే అయిపోయింది. ఎవరినీ ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ అన్నింటికన్నా కీలకమైన పాయింట్ ఏమిటంటే గిల్డ్ పెద్దగా వున్న దిల్ రాజునే కీలకంగా ఎక్కువ సినిమాలు పంపిణీ చేస్తారు. నైజాంలో ఆయన ప్రధానమైన పంపిణీ దారు. అందువల్ల గట్టిగా మాట్లాడే అవకాశం వుండడం లేదు.
మంచి డేట్ అయితే చాలు చకచకా సినిమాలు వేసేస్తున్నారు. సెప్టెంబర్ 15న ప్రశాంతంగా వస్తాము అనుకున్న స్కంద సినిమాను వెనక్కు పంపింది దిల్ రాజే అని టాక్ వుంది. ఎందుకంటే 15న వస్తుంది అనుకున్న చంద్రముఖి పంపిణీ ఆయనదే. స్కంద కూడా ఆయనదే. రెండు వేరు వేరు డేట్ లకు వస్తే సరిపోతుందని ఆయన ఆలోచించారు. కానీ అప్పటికే 29 కి వున్న పెదకాపు సంగతి ఆయన పట్టించుకోలేదు. నిజానికి గిల్డ్ పెద్దగా దాని సంగతి కూడా ఆయన చూడాలి. కానీ అది దిల్ రాజు సినిమా కాదు. మైత్రీ మూవీస్ సినిమా. అందుకే పెదకాపు ముందుగా డేట్ వేసినా, స్కంద ను తీసుకువెళ్లి అక్కడ వేయించారు.
కానీ డెస్టినీ వేరుగా వుంటుంది. చంద్రముఖి 2 కూడా వాయిదా పడింది. వెళ్లి వెళ్లి నెలాఖరు డేట్ కే పడింది. దాంతో 15 డేట్ ఖాళీగా వుండిపోయింది. 28, 29 డేట్ లు కిక్కిరిసిపోయాయి. స్కంద సోలోగా వచ్చి వుంటే మంచి ఓపెనింగ్ వచ్చి వుండేది. కానీ అది మిస్ అయింది. పెదకాపు మీద ఏ సినిమా పడకుండా వుండి వుంటే కాస్త మంచి కలెక్షన్లు కనిపించేవి. అది కూడా మిస్ అయింది. అందరూ తలా కొంచెం పంచుకోవాల్సిన పరిస్థితి
రాబోయే దసరాకు కూడా ఇదే పరిస్థితి
బాలయ్య- అనిల్ రావిపూడి- భగవత్ కేసరి, రవితేజ- అభిషేక్ అగర్వాల్ – టైగర్ నాగేశ్వరరావు ఒకేసారి వస్తున్నాయి. విజయ్-లియో కూడా అప్పుడే. లేటెస్ట్ గా బాలీవుడ్ భారీ సినిమా గణపథ్ కూడా అప్పుడే. వీటిలో భగవత్ కేసరి, లియో దిల్ రాజు పంపిణీ. టైగర్ నాగేశ్వరరావు ఆసియన్ సినిమాస్. అందువల్ల టైగర్ నాగేశ్వరరావును వెనక్కు పంపాలంటే ఎలా? మీరు ఎందుకు వెనక్కు వెళ్లరు అని అడుగుతారు అభిషేక్ అగర్వాల్. అందుకే పోటీ అనివార్యం అవుతోంది.
సంక్రాంతి సీజన్ సరేసరి. దిల్ రాజు పంపిణీ సినిమా గుంటూరు కారం, స్వంత సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ సంక్రాంతికే వున్నాయి. అందుకే హనుమాన్ ను, రవితేజ ఈగిల్ ను వెనక్కు వెళ్లమంటారు. ఎందుకంటే అవి దిల్ రాజు పంపిణీ సినిమాలు కాదు. కానీ వాళ్లు కచ్చితంగా వస్తాం అంటున్నారు.
గిల్డ్ కు సినిమాల పంపిణీలతో సంబంధం లేని బలమైన నాయకత్వం వుండాలి. అందరినీ సమానంగా, సమన్వయ పర్చగల లీడర్ షిప్ వుండి, ఆరు నెలలు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. లేదూ అంటే సినిమా హిట్, ఫ్లాప్ సంగతి తరువాత ముందు కలక్షన్లు డివైడ్ అయిపోతాయి. లేదూ అంటే సోలో గా లేదా తక్కువ పోటీలో గట్టెక్కిపోయే సినిమాలు కూడా మటాష్ అయిపోతాయి.