ఏడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకున్న `డ్రీమ్' చిత్ర దర్శకుడు భవాని శంకర్ దర్శకత్వంలో తయారవుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'క్లైమాక్స్'. డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో శ్రీరెడ్డి నటిస్తున్నారు . కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .
దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ, “పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీ ఇది. కథాంశంతో పాటు చిత్రీకరణ కూడా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో తక్కువ పాత్రలే ఉంటాయి కానీ, ప్రతి పాత్రా కూడా ఒక హీరోలాగానే అనిపిస్తుంది. ఇందులో మరో కీలకమైన పాత్రను శ్రీరెడ్డి చేస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా మనసులోని భావాల్ని వ్యక్త పరుస్తూ, ఎవరినైనా ఎదిరించి మాట్లాడే మనస్తత్వంతో ఉండే ఒక వివాదాస్పద నటి పాత్ర అది . ఆ పాత్రకి శ్రీ రెడ్డి సరిగ్గా సరిపోతుందనిపించి0ది. ఒకరకంగా ఆమె నిజజీవిత పాత్ర ఇది.చిత్ర పరిశ్రమలోని స్టీరియోటైప్ ఆలోచనలకి విరుద్ధంగా ఉండే పాత్రలు, సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి” అన్నారు.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి శ్రీరెడ్డి చెబుతూ, ” ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో నేను చేస్తున్న పాత్ర కథకి చాలా కీలకం. ఒక వివాదాస్పద నటిగా ఇందులో నా పాత్ర చుట్టూ కథనం చాలా మలుపులు తిరుగుతుంది. డైలాగులు, సీన్ల విషయంలో నాకు ఎంతో సహకరించిన డైరెక్టర్ భవాని శంకర్ మరియు ఇతర చిత్ర బృందానికి ధన్యవాదాలు” అని చెప్పారు .
నిర్మాతల్లో ఒకరైన పి.రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “ మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. హైదరాబాద్లోనే షూటింగ్ మొత్తం చేస్తున్నాం. ఒక పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి తీయబోతున్నాం“ అని తెలిపారు.