మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాసుకుపూసుకు తిరిగి, పొత్తుతో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ-శివసేనల మధ్యన దూరం పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు గడువు దాటింది. అయితే ప్రస్తుతానికి ఫడ్నవీస్ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు.
ఇక మాటల యుద్ధం మొదలైంది. తాము శివసేనతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని అంటూ ఫడ్నవీస్ కుండబద్దలు కొట్టారు. తమను శివసేన వాళ్లు అనరాని మాటలు అన్నారన్నారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీలు విమర్శించనంత స్థాయిలో మిత్రపక్షంగా ఉంటూనే శివసేన విమర్శించిందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.
ఇక ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చారు ఉద్ధవ్ ఠాక్రే. ఆయన కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. 'ఇలాంటి వారితోనే మేం పొత్తు పెట్టుకున్నది..' అనే బాధ వేస్తోందని ఠాక్రే వ్యాఖ్యానించడం విశేషం. భారతీయ జనతా పార్టీ పై అలా తీవ్రంగా స్పందించారు ఠాక్రే.
మహారాష్ట్ర సీఎం పీఠంపై శివసైనికుడిని కూర్చోబెట్టడమే లక్ష్యమని మరోసారి ఠాక్రే స్పష్టం చేశారు. అందుకోసం ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సై అని ఆయన ప్రకటించారు. ఎన్సీపీ-శివసేన పొత్తును ఎవరూ తప్పుపట్టలేరని ఠాక్రే తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ వాళ్లు పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అలాంటిది తాము ఎన్సీపీతో చేతులు కలిపితే తప్పేంటని ఠాక్రే ప్రశ్నించడం గమనార్హం! ఈ మాటతో తమ తదుపరి వ్యూహం ఏమిటో ఉద్ధవ్ తేల్చి చెప్పినట్టేనేమో!