తెలుగునాట జెన్యూన్ కలెక్షన్లు చెప్పడం అన్నది ఎప్పుడో పోయింది. నిజంగా ఓ ఎంక్వయిరీ కమిటీ పెట్టి, అసలు కలెక్షన్ల లెక్కల ఫైళ్లు బయటకు తీయిస్తే, బ్లాక్ బస్టర్లు, హిట్ లు అనుకునే చాలా సినిమాల బండారం బయటపడుతుంది. కేవలం బయట ఫ్యాన్స మధ్య హడావుడి కోసం చిత్తానికి వచ్చిన ఫిగర్లు కలుపుతున్నారు. ఫిక్స్ డ్ హయ్యర్లు కలపడం, మళ్లీ వాటి రోజువారీ కలెక్షన్ల కలపడం, డిసిఆర్ లు మార్చేయడం ఇలా చాలా కళలు వున్నాయి ఫేక్ కలెక్షన్లకు. పైగా ఇటీవల రాండమ్ గా కోటి, రెండు కోట్లు కలిపేయడం మొదలైంది. ముందుగానే బయ్యర్లను కట్టడి చేసి మరీ ఫేక్ కలెక్షన్లు ప్రచారంలోకి తెస్తున్నారు. దీంతో కలెక్షన్లు అంటే నమ్మబుద్ది కావడం లేదు.
ఇదిలా వుంటే పండగకు వచ్చిన సరిలేరు, అల వైకుంఠపురం సినిమాల మధ్య కలెక్షన్ల వార్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా సరిలేరు కలెక్షన్ల ఫిగర్లు వచ్చాయి. ఆ తరువాత అల వైకుంఠపురం యూనిట్ నుంచి రెస్సాన్స్ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా సరిలేరు జెన్యూన్ గ్రాస్ అంటూ, షేర్ ను పక్కన పెట్టి ఓ ఫిగర్ వదిలారు.
దీనికి కౌంటర్ అన్నట్లుగా అల వైకుంఠపురములో యూనిట్ ఓ విడియో చేయించినట్లు తెలుస్తోంది. ఇది ప్రత్యేకంగా చేయలేదు. ఆ సినిమాలో డైలాగ్ నే కట్ చేసి విడియో చేసారు. హర్షవర్ధన్ ను ఉద్దేశించి బన్నీ ఓ డైలాగు చెబుతాడు.
'మనం చేయనవి కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పవచ్చని మిమ్మల్ని చూసే తెలుసుకున్నా, ఓ వర్గానికి మీరు ఇన్సిపిరేషన్'
ఇదీ డైలాగు. ఈ డైలాగు పర్సస్ సినిమాలో ఏది అయినా, ఇప్పుడు వదిలితే మాత్రం ఎవరికి తగులుతుందో చెప్పక్కరలేదు. ఇంతకీ ఈ విడియో బయటకు వదులుతారో లేదో చూడాలి.