కోర్టులోకి రాజధాని రగడ!

పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాల్లో ఉంది. ఈ నిర్ణయానికి శాస్త్రోక్తంగా మమ అనిపించేందుకు… తాత్కాలిక అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే.. ఈలోగా రాజధాని తరలింపు వ్యవహారాన్ని కోర్టుకు తీసుకువెళ్లి..…

పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాల్లో ఉంది. ఈ నిర్ణయానికి శాస్త్రోక్తంగా మమ అనిపించేందుకు… తాత్కాలిక అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే.. ఈలోగా రాజధాని తరలింపు వ్యవహారాన్ని కోర్టుకు తీసుకువెళ్లి.. ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ వేయించాలనే ప్రయత్నాలు కూడా ఊపందుకున్నట్లుగా తెలుస్తోంది. పలువర్గాలనుంచి.. రాజధాని తరలింపు ఆలోచనకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఒప్పందం ప్రకారం చేయకుండా, రాజధాని తరలిస్తే రైతులు కోర్టుకు వెళ్తారని కొన్ని రోజుల కిందటే విపక్ష నాయకులు కొందరు ప్రకటించారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో మల్లగుల్లాలు పడింది. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలను క్షుణ్నంగా పరిశీలించింది. దానివల్ల న్యాయపరమైన చిక్కులు ఉండకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చింది.

కానీ.. లీగల్ గొడవ అనేది కేవలం రైతులనుంచి మాత్రమే కాదు. ఇతర రూపాల్లో కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాలు, డెవలప్ మెంట్ ప్రాజెక్టులు తీసుకున్న సంస్థలు ఉన్నాయి. పలు సంస్థలు చేపట్టే పనులు సగంలో ఉన్నాయి. వీరందరితోనూ ప్రభుత్వానికి ఒప్పందాలు ఉన్నాయి. కొన్నింటిని మాత్రం ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసుకుంది. అయితే.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. భూముల అభివృద్ధి విషయంలో కూడా ఒప్పందంలో ఉన్న మేరకు డెవలప్ చేసి, తిరిగి అప్పగిస్తాం అంటూ మంత్రులు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో స్పష్టత లోపిస్తోంది. మొత్తానికి కొంత గందరగోళం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏదో ఒక రకంగా రాజధాని గొడవను కోర్టు గడప తొక్కించి.. బ్రేకులు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

రాజ్యసభ ఎంపీ, భాజపా నేత సుజనాచౌదరి ముఖ్యమంత్రికి మంగళవారం నాడు రాసిన లేఖలో కూడా ఇలాటి ప్రస్తావనే ఉంది. రాజధాని తరలింపు వలన న్యాయపరమైన చిక్కులు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆయన చెబుతున్నట్లుగా రాజధాని తరలింపు వలన నాలుగు లక్షల కోట్ల భారం పడుతుందనేది నిజం కాకపోవచ్చు గానీ.. లీగల్ చిక్కుల హెచ్చరిక ఏదో సంకేతాలు ఇస్తున్నట్లుగానే ఉంది.