బాలకృష్ణ టాక్ షో కు కాంబినేషన్ల బెడద పట్టుకున్నట్టుగా ఉంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో టాక్ షో ల నిర్వహణ కత్తిమీద సాము! దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. యూట్యూబ్ చానళ్లు విస్తృతం అయిపోయాకా, ఇవి పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాకా.. సెలబ్రిటీ అనే ప్రతి వాడినీ కూర్చోబెట్టి గంటల కొద్దీ చాట్ షోలు నిర్వహించడం రొటీన్ అయిపోయింది. దాదాపు ఆరేళ్ల కిందట ఇలాంటి ట్రెండ్ మొదలైంది. ఒక్కో సెలబ్రిటీని గంటల కొద్దీ ఇంటర్వ్యూ చేయడం అప్పుడు మొదలైంది. అదే సమయంలో జనాలకు ఇంటర్నెట్ డేటా తక్కువ రేటుకు దొరకడమూ మొదలైంది. దీంతో అప్పట్లో ఈ చాట్ షోలకు ఒక రేంజ్ లో ఆదరణ కనిపించింది.
కట్ చేస్తే.. ఒకరిని చూసి మరొక చానల్ ఈ తరహా ఇంటర్వ్యూలు చేయడం. ఒకే చానల్ తరఫు నుంచి ఒకే సెలబ్రిటీని రెండు మూడుసార్లు ఇంటర్వ్యూలు చేయడం, వంటి చర్యలతో ఆఖరికి సదరు సినిమా వాళ్లు కూడా ఇక చెప్పుకోవడానికి ఏమీ లేవు రా బాబోయ్ అనుకునేంత పరిస్థితి ఏర్పడింది. ఏ ట్రెండ్ కైనా ఒక ఎండ్ ఉన్నట్టుగా.. ఆరేళ్ల కిందట మొదలైన ఈ ఇంటర్వ్యూల పరంపరకు రెండు మూడేళ్ల కిందటే కాస్త బ్రేకులు పడటం మొదలైంది!
ఇక ఇంటర్వ్యూలు చేయడానికి మిగిలింది ఎవ్వరూ లేక అనామకులను, అర్బకులను, ఆఖరికి ఓవర్ నైట్ సెలబ్రిటీలను కూడా బోలెడన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాయి యూట్యూబ్ చానళ్లు. కరోనా సమయంలో ఒక రకంగా ఈ పరంపరకు బ్రేకులు పడ్డాయి. ఆ సమయంలో సెలబ్రిటీలు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితుల్లో.. ఒక రకంగా ఆ ట్రెండ్ అప్పటికే ముగిసింది.
ఇప్పటికీ పాత ఇంటర్వ్యూలు బాగా వైరల్ కావడమే తప్ప, కొత్తగా చేసే ఇంటర్వ్యూలు ఆ స్థాయిలో ఆదరణ పొందడం లేదు కూడా! ఇక ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా.. అది కేవలం అది కేవలం వారి సినిమా ప్రమోషన్లో భాగంగా మాత్రమే!
ఇప్పుడు నందమూరి నటసింహం చాట్ షో కు కూడా హాజరవుతున్న వారిలో ఇలాంటి బాపతే ఎక్కువ! అలాగే అలీ నిర్వహించే టాక్ షో పరిస్థితీ ఇదే. ఈ వారంలో ఏదో సినిమా విడుదలను పెట్టుకున్న వారే ఎక్కువగా ఇలాంటి చాట్ షోలకు హాజరై తమ సినిమాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ చాట్ షో ఒక కోణం ఇలా సినిమాల ప్రమోషన్ లో భాగం అయిపోయింది!
ఇక కాంబినేషన్లను సెట్ చేయడంలో కూడా బాలకృష్ణ టీమ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. మొన్నామధ్య కిరణ్ కుమార్ రెడ్డి-సురేష్ రెడ్డి కాంబినేషన్లో రాధిక రోల్ ప్రశ్నార్థకం అయ్యింది. అయినా కిరణ్- సురేష్ ల కాంబినేషన్లో ఎప్పుడో సాక్షిలో జాయింట్ ఇంటర్వ్యూ ఒకటి చేశారు! 2009లోనే వీరిద్దరి జాయింట్ ఇంటర్వ్యూ సాక్షిలో ప్రచురితం అయ్యింది. అప్పట్లో ఈ జంట ఏ ముచ్చట్లు చెప్పిందో ఇప్పుడూ అదే ముచ్చట్లే వినిపించాయి. పుష్కర కాలం తర్వాత అదే కథా! వినేవాళ్లకు బోర్ కొట్టదూ?
ఇక ఇలా కాకుండా సోలోగా సెలబ్రిటీలను పిలిచి ఇంటర్వ్యూలు చేస్తే.. అది మరో అలీ షో అవుతుంది! సెలబ్రిటీల వద్ద కూడా చెప్పడానికి ఇంక మిగిలినవి ఏమీ లేవు! ఆ పాత ఇంటర్వ్యూలన్నీ చూసి కొత్త ప్రశ్నావళి తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే రకరకాల కాంబినేషన్లను సెట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అవి కాస్తా.. గందరగోళం అవుతున్నట్టున్నాయి!