భారత్ వెలిగిపోతోంది అనేది పాత స్లోగన్. 'భారత్ భగ్గుమంటోంది' అనేది త్వరలోనే రాబోయే స్టేట్ మెంట్. అవును.. రాబోయే 15 ఏళ్లలో భారత్ లో జనాభాతో పాటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరగుతాయని వరల్డ్ బ్యాంక్ కు అనుబంధంగా పనిచేసే ఓ సంస్థ నివేదిక విడుదల చేసింది. దీని వల్ల వాతావరణ పరిస్థితులతో పాటు, భారతీయుల సామాజిక పరిస్థితులు కూడా మారుతాయని ఆ నివేదిక అంచనా వేస్తోంది.
2050 నాటికి ఇండియాలో సగం జనాభా సిటీల్లోనే నివశిస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు మరింత పెరిగి వాతావరణం వేడెక్కుతుందని నివేదిక తెలిపింది. మరో పాతికేళ్లలో భారత్ లోని నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతాయని, వేడి-కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారని సదరు నివేదికలో స్పష్టం చేశారు.
ఈ పరిస్థితుల ప్రభావం మరో 8-10 ఏళ్లకే బయటపడుతుందని, మానవ వనరులు, ఉత్పాదకత తగ్గి 2030 నాటికి దాదాపు 35 మిలియన్ ప్రజలు తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటారని “క్లైమేట్ ఇన్వెస్టిమెంట్ ఆపర్ట్యూనిటీస్ ఇన్ ఇండియా” అనే నివేదికలో వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా అవతరించబోతోంది భారత్. ఆ టైమ్ కు దేశంలో కర్బన ఉద్గారాలు పెరిగి, ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని, మధ్యతరగతి నుంచి ఉన్నతవర్గాల వరకు అందరూ ఏసీల్ని ఆశ్రయిస్తారని నివేదిక తెలిపింది. రాబోయే 15 ఏళ్లలో ఇండియాలో ఏసీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని, 15 సెకెన్లకు ఓ ఏసీ అమ్ముడవుతుందని నివేదిక స్పష్టం చేసింది.
ఇప్పట్నుంచే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని నివేదిక సూచిస్తోంది. మధ్యతరగతి జనాభా ఎక్కువగా పెరిగి, ధర-నాణ్యత తక్కువగా ఉండే ఏసీల్ని ప్రజలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణానికి మరింత నష్టం వాటిల్లుతుందని, ఇంటి నిర్మాణంలో కూడా మార్పులు అవసరమని నివేదిక అభిప్రాయపడింది.