వెండితెరపై కాస్త గుర్తింపు తెచ్చుకుంటే చాలు సినిమాలపై నటులకు మోజు ఏర్పడుతోంది. తాజాగా కమెడియన్ సప్తగిరి రాజకీయ ప్రవేశంపై స్పందించారు. త్వరలో రాజకీయంగా శుభవార్త చెప్తానని ప్రకటించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంలో చేరనున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
అభివృద్ధి అంటే చంద్రబాబే అని ఆయన అన్నారు. పాదయాత్రలో నారా లోకేశ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. సినిమాల వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్నారు. సినిమాల్లో ఏ విధంగా అయితే నీతి, నిజాయతీ, నిబద్ధతతో పని చేసి గుర్తింపు తెచ్చుకున్నానో, అదే రీతిలో రాజకీయాల్లో కూడా పేరు తెచ్చుకుంటానని సప్తగిరి చెప్పారు.
చంద్రబాబు విజన్ ఉన్న నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిన నాయకుడిగా అభివర్ణించడం ద్వారా ఆ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పకనే చెప్పారు.
తాను చిత్తూరు జిల్లాలో ఐరాలలో పుట్టి పెరిగానన్నారు. బంగారుపాళ్యెంలో చదువుకున్నట్టు చెప్పారు. తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. టీడీపీ అధిష్టానం పెద్దల సూచన మేరకు పోటీలో ఉంటానన్నారు. సప్తగిరి రాజకీయ ప్రవేశంతో చిత్తూరు జిల్లా నుంచి నటుల సంఖ్య పెరుగుతోంది.
గతంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన శివప్రసాద్ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే ఆర్కే రోజా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సప్తగిరి ఆ జాబితాలో చేరనున్నారు.