కమిటీ కుర్రోళ్ల భావోద్వేగాలు

ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో తమ చిన్నతనం గుర్తుకు వస్తుంది. ఆ రోజులే వేరు.. ఆ కాలమే వేరు.. ఎంత బాగుండేదో అనిపిస్తుంది. అలా అనుకోవటం కూడా నిజమే! ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు,…

ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో తమ చిన్నతనం గుర్తుకు వస్తుంది. ఆ రోజులే వేరు.. ఆ కాలమే వేరు.. ఎంత బాగుండేదో అనిపిస్తుంది. అలా అనుకోవటం కూడా నిజమే! ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది… ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు.

ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం విశేషం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం రోజున ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్‌ ను విడుదల చేసింది. హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

టీజర్‌ను గమనిస్తే కొంత మంది యువకులు వారి బాల్యాన్ని తలుచుకుంటూ అప్పట్లో ఆటలు ఆడుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరదాగా గడిపిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు. చిన్నతనంలో వాళ్లందరూ కలిసి ఓ ఇడ్లీ అంగల్లో ఇడ్లీలు తినటం, పంపు సెట్టు దగ్గర సరదాగా స్నానాలు చేయటం వంటి సన్నివేశాలను చూడొచ్చు. అలాగే టీనేజ్‌లో మనసుకు నచ్చిన అమ్మాయిలను ప్రేమించటం, ఆ సందర్బంలో జరిగిన కామెడీని వారు గుర్తుకు తెచ్చుకోవటం వంటి సన్నివేశాలను కూడా టీజర్లో గమనించవచ్చు.

ఇదే టీజర్‌లో ఊర్లో జరిగే గొడవలను కూడా చూడొచ్చు. అసలు సరదాగా ఉండాల్సిన యువత ఊళ్లో గొడవల్లో ఎందుకు తలదూర్చుతారు. ఆ గొడవల కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనే విషయాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.