ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించారని సినీజనాలు గగ్గోలు పెడుతున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వీళ్ల వితండవాదం వీళ్లదే. ఉన్నఫలంగా టికెట్ రేట్లు పెంచేయాలి, మొదటి వారం ఫ్లాట్ రేట్లు పెట్టేయాలి, కోట్లు పిండుకోవాలి. దీని కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ప్రభుత్వంపై ఎన్ని విమర్శలైనా చేస్తారు? మరి టికెట్ రేట్లు పెంచితే ఏమౌతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.
రేపట్నుంచి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. గరిష్టంగా 290 రూపాయల వరకు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఇంకేముంది, థియేటర్ యాజమాన్యాలు విరుచుకుపడ్డాయి. రేపట్నుంచి కొత్త రేట్లను అమల్లోకి తెచ్చాయి. దీంతో రేపు రిలీజ్ అవుతున్న అర్జున ఫాల్గుణ సినిమా టికెట్ ధర అక్షరాలా 329 రూపాయలు (టాక్సులతో కలుపుకొని) అయింది. మరి అర్జున ఫాల్గుణ లాంటి సినిమాను 329 రూపాయలు పెట్టి సామాన్య ప్రేక్షకుడు చూస్తాడా?
శ్రీవిష్ణు సినిమా కాబట్టి కొంతమందైనా చూస్తారని అనుకుందాం. మరి ఈ సినిమాతో పాటు వస్తున్న అంతఃపురం, విక్రమ్, సత్యభామ లాంటి సినిమాల పరిస్థితేంటి? టికెట్ రేట్లు అందుబాటులో ఉండే కనీసం కొంతమందైనా ఈ సినిమా చూసేవారు. నిజంగా కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ తో ఆ సినిమా ఒడ్డున పడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడలాంటి మౌత్ టాక్ కు కూడా అవకాశం లేకుండా టికెట్ రేట్లు పెంచేశారు.
మొత్తం ఎంత ఖర్చు..
మల్టీప్లెక్సులో సినిమా చూడడం అనేది కేవలం టికెట్ రేటుతో ఆగిపోదు. నలుగురు సభ్యులున్న కుటుంబం ఓ సినిమాకు వెళ్తే.. టికెట్ ధర 1300 అవుతుంది. ఇంటర్వెల్ లో వాళ్ల స్నాక్స్ ధర అటుఇటుగా 600 (ఇది చాలా తక్కువ) అవుతుంది. ఇక ఇంటి నుంచి మల్టీప్లెక్సుకు రానుపోను కనీసం 300 రూపాయలైనా అవుతుంది. అంటే.. తెలంగాణలో ఓ కుటుంబం మల్టీప్లెక్సుకు వెళ్లి సినిమా చూసి రావాలంటే అటుఇటుగా 2200 అవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ లో ఇవే లెక్కలు వేసుకుంటే.. దాదాపు వెయ్యి రూపాయల్లోనే వినోదం లభిస్తుంది. కానీ టాలీవుడ్ జనాలకు అది ఇష్టం లేనట్టుంది.
సరిగ్గా ఇక్కడే ఓటీటీ లెక్కలు కూడా చర్చకొస్తున్నాయి. తెలంగాణలో ఓ సినిమాకు పెట్టిన ఖర్చుతో.. అన్ని ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను ఏడాది పాటు పొందవచ్చు. ఓటీటీ ధరలన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఓ చిన్న సినిమాను థియేటర్లలో చూడాలనుకునే ప్రేక్షకుడు సైతం డ్రాప్ అవుతాడు. ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటాడు. తెలంగాణలో రేపట్నుంచి జరగబోయేది అదే.
నిజానికి జీవో అర్థం ఇది కాదు
పెద్ద సినిమాలపై అంచనాలుంటాయి. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాబట్టి రేటు ఎంత ఫిక్స్ చేసినా ఆక్యుపెన్సీ ఉంటుంది. వసూళ్లు వస్తాయి. మరి చిన్న సినిమా పరిస్థితేంటి? ఎలాంటి అంచనాల్లేని సినిమాలకు ఎవ్వరూ వెళ్లాలనుకోరు. అలాంటి సినిమాలవైపు ప్రేక్షకుడ్ని ఆకర్షించాలంటే టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. కనీసం 100 రూపాయల్లో (బాల్కనీ) పనైపోతుందనుకుంటే.. చిన్న సినిమాను చూడ్డానికి ప్రేక్షకుడు ఆసక్తి చూపిస్తాడు. తెలంగాణలో ఇప్పుడా పరిస్థితి లేదు. రేపట్నుంచి చిన్న సినిమాకు థియేటర్లలో జీవన్మరణ సమస్య తప్పదు.
అయితే ఈ విషయంలో థియేటర్లు జీవోను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఎందుకంటే.. టికెట్ రేటును గరిష్టంగా 295 రూపాయల వరకు పెట్టుకోవచ్చని మాత్రమే ప్రభుత్వం చెప్పింది. అంటే దీనర్థం ప్రతి సినిమాకు 295 రూపాయల రేటు పెట్టాలని కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకొని తమ సినిమా టికెట్ ను నిర్ణయించుకోవచ్చు. ఇదే విషయాన్ని నిఖిల్ లాంటి హీరోలు చెబుతున్నారు. చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించుకోవాలని కోరుతున్న నిఖిల్.. తన సినిమాల టికెట్ రేట్లను మాత్రం సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులోనే ఉంచుతానని ప్రకటించాడు. నిఖిల్ సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతానికి తెలంగాణలో మల్టీప్లెక్సుల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీలో టికెట్ రేట్లు పెంచమంటారా..?
తెలంగాణలో పెరిగిన టికెట్ రేట్లను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు నెటిజన్లు. ఏపీలో టికెట్ రేట్లు పెంచాలని ఆందోళన చేస్తున్న జనాలు, ఇంత రేటు పెట్టి అర్జున ఫాల్గుణ సినిమా చూస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. సినీ పరిశ్రమ బతకాలన్నా, థియేట్రికల్ వ్యవస్థ కళకళలాడాలన్నా టికెట్ రేట్లు అందుబాటులో ఉండాల్సిందే. తమ సినిమాకు వందల కోట్లు బడ్జెట్ పెట్టాం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకుంటాం అనడం కరెక్ట్ కాదు. తమ హీరో 50 కోట్లు తీసుకుంటున్నాడు కాబట్టి, మొదటి వారం రోజులు ఫ్లాట్ రేట్లు పెట్టుకుంటామనడం అన్యాయం.
అదే టైమ్ లో టికెట్ రేటును 5 రూపాయలు, 10 రూపాయలుగా ఫిక్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దీనికో మధ్యేమార్గాన్ని కనిబెట్టాలి. తాజాగా ఏపీలో దీనిపై ఏర్పాటైన కమిటీ, ఈ మధ్యేమార్గాన్ని కనిబెడుతుందనే ఆశిద్దాం. ఈలోగా టాలీవుడ్ కు చెందిన జనాలెవ్వరూ 'కిరాణ' వ్యాఖ్యలు చేయకుండా ఉంటే అది అందరికీ మంచిది. లేదంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే అవుతుంది.