ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ పై మొన్నటివరకు చాలా ఊహాగానాలు నడిచాయి. జీ గ్రూప్ సంస్థ ఏకంగా 235 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అన్నింటినీ గంపగుత్తగా దక్కించుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అసలు మేటర్ ఇది.
జీ గ్రూప్ సంస్థ కేవలం ఈ సినిమా సౌత్ లాంగ్వేజెస్ కు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను మాత్రమే దక్కించుకుంది. నిబంధనల ప్రకారం.. ఆర్ఆర్ఆర్ రిలీజైన 8 వారాల తర్వాత జీ5లో సినిమాను స్ట్రీమింగ్ కు ఉంచుతారు. అది కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే. హిందీ వెర్షన్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేస్తుంది.
ఇక శాటిలైట్ విషయానికొస్తే.. సౌత్ లోని అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న జీ గ్రూప్ సంస్థ.. శాటిలైట్ రైట్స్ ను మాత్రం వదులుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను ఎప్పట్లానే స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.
జీ ఇచ్చిన కొటేషన్ కంటే 5 కోట్లు అదనంగా చెల్లించి తెలుగు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఆ మేరకు జీ తెలుగు ఓ భారీ సినిమాను మిస్ అయినట్టయింది. హిందీ శాటిలైట్ రైట్స్ ను మాత్రం జీ గ్రూప్ దక్కించుకోగా.. తమిళ, కన్నడ శాటిలైట్ రైట్స్ స్టార్ గ్రూప్ కే దక్కాయి.
ఇక విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ మొత్తాన్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి ఇప్పటికే ఈ హక్కులన్నింటినీ పెన్ స్టుడియోస్ దక్కించుకోగా.. ఆ సంస్థ నుంచి ఇవన్నీ ఆ హక్కుల్ని సంపాదించుకున్నాయి. నార్త్ థియేట్రికల్ రైట్స్ మాత్రం పెన్ స్టుడియోస్ వద్దే ఉన్నాయి.
పెన్ స్టుడియోస్ సంస్థ ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్, నార్త్ థియేట్రికల్ రైట్స్ ను 400 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తాజా అమ్మకాలతో ఈ సంస్థకు భారీగా లాభాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి పూర్తి క్లారిటీ ఇది.