నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీ ‘ఎయిమ్స్’ ఏంటి? అనేది ఇప్పుడు ప్రధానంగా రేకెత్తిస్తున్న ప్రశ్న. ఆయన నొప్పులకు సరైన చికిత్స ఢిల్లీలోనే దొరుకుతుంది. అదే ఆయన ‘ఎయిమ్స్’కు వెళ్లడానికి ప్రధాన కారణం కూడా. ఇంకా ఆయన కాళ్ల నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
రెండు రోజులుగా బీపీ పెరుగుతుండటం, మగతగా ఉండటం, నోరు కూడా తరచుగా పొడారి పోతున్నట్టుగా ఉందని ఆయన ఆరోగ్య బులిటెన్‌ను రఘురామను మోసే మీడియా రోజువారీ విడుదల చేస్తోంది. అందువల్ల ఇంకా రెండు మూడు రోజులు సికింద్రాబాద్ సైనికాస్పత్రిలోనే రఘురామ ఉంటారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
అయితే ఈ లోపు ఏమైందో తెలియదు కానీ, అకస్మాత్తుగా ఆయన సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జి అయ్యారు. వెంటనే ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయి ప్రతిష్టాత్మక ఎయిమ్స్ వైద్యశాలలో చేరారు. జగన్ సర్కార్ అదృష్టం కొద్దీ ఆయన మిలటరీ ఆస్పత్రిలో ఉన్నారు. లేదంటే రఘురామ బీపీ పెరగడం, కాళ్లు నొప్పులు తీయడం, నోరు ఆరిపోవడంపై ఏ అంతర్జాతీయ కోర్టుకో ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది.
రఘురామను ఇంతకాలం మోస్తున్న చానళ్లలో బీపీ ఎందుకు పెరుగుతుంది? నోరు ఎందుకు తరచూ పొడిబారుతుంది? అలాగే ఎంతకూ కాళ్ల నొప్పులు తగ్గకపోవడానికి కారణాలేంటి? అనే అంశాలపై ఆస్థాన నిపుణులతో చర్చలు నిర్వహించి, చివరికి ఏపీ సీఐడీ పోలీసుల చర్యల వల్లే ఇదంతా అని నిర్ధారించే వాళ్లే. దానిపై ఓ వ్యాజ్యం దాఖలయ్యేది. దాని నుంచి బయట పడేందుకు జగన్ సర్కార్ నానా యాతన పడాల్సి వచ్చేది.
సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో రఘురామ ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి జగన్ సర్కార్ తప్పించుకున్నట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవంటారు. రఘురామకృష్ణంరాజు స్వభావ రీత్యా మంచి మాటకారి.
మాటకు తగ్గట్లు హావభావాలు ఆయన స్పీచ్‌కు ప్రత్యేక ఆకర్షణ. మరీ ముఖ్యంగా ఆయనలో సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. అయితే అది కాస్త ఒక్కోసారి వికటిస్తుంటుంది. అదే వేరే విషయం. ఆయన ఢిల్లీ వెళ్లారంటే రచ్చబండ నిర్వహించి తీరాల్సిందే. ఇదే ఇంతకాలం సాగుతూ వచ్చింది. అయితే సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో రఘురామ నోటికి కళ్లెం వేసినట్టైంది. కానీ రఘురామ స్వభావం తెలిసిన వారెవరైనా , ఆయన ఊరుకుంటారని భావించడం లేదు.
రచ్చబండ నిర్వహించకుండానే రచ్చ చేయగల శక్తిసామర్థ్యాలు ఆయన సొంతమని పలువురి అభిప్రాయం. ఇప్పటికే రఘురామ మిలటరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినది మొదలు, ఆయన అనుకూల చానళ్లు రచ్చ స్టార్ట్ చేశాయి. రఘురామ ఢిల్లీలోని కేంద్ర పెద్దలను కలుస్తారని, తనపై ఏపీ సర్కార్ అక్రమ కేసు బనాయింపు, అరెస్ట్, కస్టడీలో చేయి చేసుకోవడంపై ఫిర్యాదు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలు పెట్టాయి.
పేరుకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ అని, ఇక రేపటి నుంచి కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసే పనిలో రఘురామ ఉంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పైకి కనిపించని దెబ్బలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయింట్‌మెంట్ పూసే అవకాశం ఉందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మొదలు, రఘురామపై ప్రసారమ వుతున్న కథనాలను పరిశీలిస్తే …మాత్రం రఘురామ అసలు ‘ఎయిమ్స్’ ఏంటో చెప్పకనే చెబుతున్నాయి.
ఆయన కేంద్ర హోంమంత్రి, ఇతరత్రా పెద్దలను కలవకుండా ఏదో జరిగిపోతుందనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఆయన పెద్దల్ని కలిస్తే… ఇంకేమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఎటూ లీక్‌లు ఉండనే ఉన్నాయి. ఒకటంటే వంద రకాలుగా చెప్పే విద్యలో ఆరితేరిన నిపుణులు ఉండనే ఉన్నారు. ఇక మీడియాతో రఘురామ మాట్లాడాల్సిన పనేంటి? ఆయన మాట్లాడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆయన నొప్పులు తగ్గాలంటే ఢిల్లీలో మాత్రమే ట్రీట్‌మెంట్ జరగాలి మరి! బహుశా ఆయన ఫిర్యాదులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఢిల్లీకి పిలుపించుకుని…‘రాజు’ గారని కూడా చూడకుండా అభ్యంతరకరంగా వ్యవహరించడంపై మందలించే అవకాశాలుంటాయేమో! ఏమో…రాజుగారు అసామాన్యులు కదా!
సొదుం రమణ