దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూ ఉంది. శని, ఆది వారాల్లో పరీక్షలు చేయించుకునే వాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో..సోమ, మంగళవారాల్లో వెల్లడయ్యే నంబర్లు తగ్గడం, ఆ తర్వాత బుధ వారం వెల్లడయ్యే నంబర్ల సంఖ్య కాస్త పెరగడం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో తాజాగా వెల్లడయిన నంబర్ మరోసారి రెండు లక్షల పై స్థాయిలో నమోదు అయ్యింది. ఈ వారంలో కరోనా రోజువారీ నంబర్ల సంఖ్య మరింత తగ్గవచ్చని అంచనా.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే.. రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపుకు తగ్గితే ఉధృతి కాస్త తగ్గినట్టుగా పరిగణించే అవకాశాలున్నాయి. జూన్ లో ఈ సెకెండ్ వేవ్ క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా నుంచి ఇది శాశ్వత విముక్తి కాదనే అభిప్రాయాలు మాత్రం ఉండనే ఉన్నాయి. రోజు వారీగా పరిమిత సంఖ్యలో కేసులు నమోదు అయ్యే పరిస్థితి వచ్చినా, మరోసారి ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకుని విజృంభించే అవకాశాలున్నాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దాన్నే మూడో వేవ్ అంటున్నారు నిపుణులు.
ఆరేడు నెలల్లో కరోనా మూడో వేవ్ లో విజృంభించవచ్చని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ కూడా అంచనా వేసింది. అయితే మరి కొందరు నిపుణులు మాత్రం మూడో వేవ్ గురించి ఇప్పుడే అంచనాలకు వచ్చే వీలు లేదని అంటున్నారు. మూడో వేవ్ అసలు వస్తుందో రాదో, వచ్చేట్టు అయితే ఎప్పుడో అంచనా వేయడానికి కూడా ఏమీ లేదని అంటున్నారు.
సెకెండ్ వేవ్ తీరు తెన్నులను గమనిస్తే.. వైరస్ రూపు మార్చుకుని విజృంభించింది అనేది నిపుణులు చెబుతున్న విషయం. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ నుంచినే ఇండియాలో కరోనా భయం పోయింది. ఆ సమయంలో పెళ్లిళ్లు, వేడుకలకు వందల, వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మాస్కులు పక్కన పెట్టేశారు. అయితే సెకెండ్ వేవ్ రాజుకున్నది ఫిబ్రవరి రెండో వారం నుంచి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఇష్టానుసారం తిరిగినా కేసులేవీ నమోదు కాలేదు. బహుశా అప్పటికి వైరస్ ఇంతలా వ్యాపించే శక్తిని సంతరించుకునేలా రూపును మార్చుకోలేదేమో!
అలాగే మూడో వేవ్ వైరస్ కు ప్రధాన టార్గెట్ పిల్లలే అవుతారనే వాదన కూడా అసంబద్ధమే అని మాట వినిపిస్తోంది. అలా చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవని అంటున్నారు. సెకెండ్ వేవ్ లోనే వైరస్ అన్ని వయసుల వారి మీదా ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. చిన్న పిల్లల్లో కూడా చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్క బెంగళూరు నగరంలోనే 40 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
అక్కడ 10 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. వారిలో పిల్లల సంఖ్య అధికారికంగనే 40 వేల వరకూ ఉంది. ఇలా చూస్తే.. సెకెండ్ వేవ్ లో చిన్నారులు కూడా బాధితులే అని స్పష్టం అవుతోంది. అయితే పిల్లల్లో సింప్టమ్స్ మాత్రం పరిమితమే. దీని వల్ల కొందరు పిల్లలకు టెస్టులే చేయకపోయి ఉండవచ్చు. అంటే.. సెకెండ్ వేవ్ లోనే పెద్దవాళ్లతో సమాన స్థాయిలోనే పిల్లలకు కూడా కరోనా అంటుకుందని స్పష్టం అవుతూనే ఉంది.
ఒకరిద్దరు కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ గా తేలిన ఇళ్లల్లో పిల్లలకు చెక్ చేయిస్తే వారు కూడా పాజిటివ్ గా తేలిన ఉందంతాలున్నాయి. అయితే పిల్లల్లో స్వల్ప అస్వస్థత మాత్రమే చోటు చేసుకుంది. ఇలాంటప్పుడు ప్రత్యేకంగా పిల్లల కోసమే లేదా పిల్లలపైనే అధిక ప్రభావం చూపేలా థర్డ్ వేవ్ వస్తుందనే వాదన కేవలం భయాన్ని పెంచేలా మాత్రమే ఉంది. భయపడటం కన్నా, ఒకవేళ అదే జరిగితే ఎలా ఎదుర్కొనాలనేందుకు రెడీ కావడం ఉత్తమం.
మూడో వేవ్ కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అది పిల్లలపై ప్రభావమా, పెద్దలపై ప్రభావమా అంటూ విశ్లేషించుకోవడం కన్నా.. మూడో వేవ్ అంటూ వస్తే దాన్ని ఎదుర్కొనడానికి తగిన రీతిలో వైద్యసౌకర్యాలను మెరుగుపరుచుకోవడం, ముందు జాగ్రత్తలు, మాస్కులు-శానిటైజర్లను కొనసాగించడం మంచిది.