సినీ దర్శకుడు ఎన్.శంకర్ కు తెలంగాణ సర్కారు చేసిన భూ కేటాయింపుల వ్యవహారం కోర్టుకు చేరింది. శంకర్ కు ప్రభుత్వం అయాచితంగా భూ కేటాయింపు చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
ఎకరం కనీసం ఐదు కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న చోట, కేవలం ఎకరా ఐదు లక్షల రూపాయల ధరతో ఐదు ఎకరాల భూమిని శంకర్ కు కేటాయించిందట తెలంగాణ ప్రభుత్వం.
ఈ విషయంపై అభ్యంతరం చెబుతూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు. సినీ స్టూడియో కట్టడానికి అంటూ శంకర్ కు భూ కేటాయింపు చేసిందట ప్రభుత్వం. ఖరీదైన నివాస ప్రాంతంలో ఐదెకరాల భూమిని ఇలా కేటాయించిందట.
కేవలం శంకర్ కే గాక ఇలా అతితక్కవ ధరకే పలువురికి భూమిని కేటాయించారని..పిటిషనర్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హై కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇలాంటి పిటిషన్లు మరిన్ని ఉన్నాయని.. వాటన్నింటినీ కలిపి విచారించనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. ఈ విషయంలో మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన ఈ భూ కేటాయింపుల జీవోలను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని కోర్టు మున్సిపల్ శాఖను ఆదేశించినట్టుగా సమాచారం.