'ఎకరా కనీసం రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే చోట.. ఐదు లక్షల రూపాయలకే ఆయనకు కేటాయించడం ఏమిటి?' అంటూ హై కోర్టు ప్రశ్నించడంతో.. తెలంగాణ ప్రభుత్వం సినీ దర్శకుడు ఎన్.శంకర్ కు కేటాయించిన భూ వ్యవహారం మరింత ఇరకాటంలో పడింది. కొంత కాలం కిందట శంకర్ కు ఎకరానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఐదు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ మేరకు కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దానిపై ఒక తెలంగాణ వ్యక్తే కోర్టుకు ఎక్కారు. దీంతో విచారణ కొనసాగుతూ ఉంది.
ఈ నేపథ్యంలో అక్కడ భూమి ధర ఎంతో కోర్టు ఆరా తీసింది. ఎకరానికి కనీసం రెండున్నర కోట్ల రూపాయల విలువ చేస్తుందనే విషయాన్ని తెలుసుకుని, అలా భూ సంతర్పణ చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించినట్టుగా సమాచారం!
సినిమా వాళ్లకు భూ కేటాయింపులు కొత్త కాదు. ప్రత్యేకించి వాళ్లు స్టూడియోలకు అంటూ భూములు తీసుకోవడం, అవి కమర్షియల్ స్పేస్ లుగా మారిపోవడం హైదరాబాద్ లో పాత ముచ్చట్లే. స్టూడియోలకు అంటూ కేటాయించిన భూములను సినిమా వాళ్లు కమర్షియల్ గా వాడుకోవడం, అమ్ముకోవడం కూడా జరిగాయి ఇది వరకూ.
ఇలాంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా ఆ రాష్ట్రానికి చెందిన సినీ ప్రముఖుడిగా శంకర్ భూమిని పొందినట్టుగా ఉన్నారు. అక్కడ స్టూడియో నిర్మించే ఉద్దేశం ఉన్నట్టుగా ఆయన కోర్టుకు కూడా చెప్పారట. స్టూడియో వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతుందని కూడా వివరించారట. అయినా కూడా ఈ భూ వ్యహారంలో కోర్టు ప్రభుత్వానికి ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం.