తెలుగు మీడియా దిగ్గజం, టీడీపీ అధినేత చంద్రబాబు రాజగురువు రామోజీరావుతో మాజీ ఎంపీ, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్త మిత్రుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఉండవల్లి పోరాట ఫలితంగా జీవిత చరమాం కలో రామోజీరావు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు అనే కలం ఆయుధాన్ని చేతపట్టి రాజకీయాలను శాసిస్తూ వచ్చిన రామోజీకి ఉండవల్లి లాంటి ఓ సామాన్య రాజకీయ నేతకు భయపడాల్సి వస్తుందని ఏ రోజూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ ఉమ్మడి హైకోర్టు చిట్ట చివరి పనిదినానికి ఒక్క రోజు ముందు తనపై ఉన్న కేసును కొట్టి వేయించుకున్న ఆనందం ఎంతో కాలం నిలబడలేకపోయింది.
తాజాగా మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో మార్గదర్శి కేసు మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకొంది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌యుఎఫ్ (హిందూ జాయింట్ ఫ్యామిలీ) వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు జస్టిస్ రజిని రామోజీరావుపై కేసును కొట్టివేశారు. కేసు కొట్టివేసిన విషయం గోప్యంగా ఉండిపోయింది.
ఈ విషయం ఎలాగోలా తెలుసుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తిరిగి యాక్టివ్ అయ్యారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
కేసు రుజువైతే రూ.7వేల కోట్ల జరిమానా, రెండేళ్ల జైలు
కాగా ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చర్చకు దారి తీశాయి. రామోజీరావుపై మోపబడిన ఆర్థిక నేరం సుప్రీంకోర్టులో రుజువైతే ఆర్బీఐ చట్ట నిబంధనల ఉల్లంఘన ప్రకారం రెండున్నరరెట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 7 వేల కోట్లు జరిమానా విధించే అవకాశం ఉందని, అలాగే రెండేళ్ల జైలుశిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
తన కేసు విషయంలో రామోజీరావు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినా ఉండవల్లి అరుణ్‌కుమార్ వేట నుంచి తప్పించుకోలేకపో యారు. ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం డిసెంబరు 31, 2018న రామోజీరావుపై ఉన్న కేసును కొట్టేసింది. అయితే లోకం అందరి గురించి వార్తలు రాసే ఈనాడు….తన అధిపతిపై కీలక కేసు కొట్టి వేయడాన్ని మాత్రం దాచి పెట్టింది. మూడో కంటికి తెలియకుండా, ఏ మీడియాలో కూడా సమాచారం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ… ఉండవల్లి దృష్టిని మరల్చలేకపోయారు.
ఈ కేసు కొట్టివేత విషయమై ఉండవల్లి అరుణ్‌కుమార్ గతంలో ఆసక్తికర కథనం చెప్పారు. మార్గదర్శి లాంటి కేసు స్వభావం ఉన్న మరో కేసులోని ముద్దాయి తనను కలిసినప్పుడు రామోజీపై ఉమ్మడి హైకోర్టు కొట్టి వేయడం గురించి ప్రస్తావన తెచ్చినట్టు చెప్పారు. అప్పుడు వెంటనే అప్రమత్తమై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినట్టు ఈ ఏడాది జనవరిలో ఉండవల్లి ఢిల్లీ వేదికగా మీడి యాకు చెప్పి ఆశ్చర్యపరిచారు.
అంతేకాదు, ట్రయల్ కోర్టులో స్టేలు తెచ్చుకుని సంవత్సరాల తరబడి మార్గదర్శి కేసు ఆపుతూ వచ్చారు. డిపాజిటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ… తెలంగాణను మాత్రమే పార్టీగా చేశారు. ఏపీలో అధికార మార్పిడి నేపథ్యంలో వైఎస్ జగన్ సీఎం కావడంతో రామోజీకి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే ఉండవల్లి సుప్రీంకోర్టులో ఏపీని కూడా ఇంప్లీడ్ చేయాలని విన్నవించడంతో ఆ ప్రకారమే ధర్మాసనం చేసింది. మొత్తానికి సుప్రీంకోర్టు నోటీసులతో రామోజీరావుకు మున్ముందు ఇబ్బం దులు తప్పేలా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉండవల్లి అరుణ్‌కుమార్ దెబ్బకు రామోజీరావు గిలగిల లాడుతున్నారు.