ఎన్సీబీ ఆధికారులు ఆఖరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్ తో ఆర్యన్ ఖాన్ కు దిమ్మ తిరిగింది. కొడుక్కి బెయిల్ వస్తుందని భావించిన షారూక్ కు మైండ్ బ్లాక్ అయింది. అవును.. ఇది నిజంగా పెద్ద ట్విస్ట్. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ మెసేజీల్ని కోర్టుకు దాఖలు చేశారు ఎన్సీబీ అధికారులు. దీంతో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు మరోసారి నిరాకరించింది.
త్వరలోనే హీరోయిన్ గా అరంగేట్రం చేయబోతున్న ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నటితో ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాటింగ్ చేశాడు. అది కూడా క్రూయిజ్ షిప్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన సమయంలోనే ఛాటింగ్ చేశాడు. తన ఛాటింగ్స్ లో సదరు ఔత్సాహిక హీరోయిన్ తో డ్రగ్స్ ప్రస్తావన తీసుకొచ్చాడట ఆర్యన్.
ఆ ఛాటింగ్ స్క్రీన్ షాట్స్, వివరాల్ని ఎన్సీబీ అధికారులు సరిగ్గా ఈరోజే కోర్టుకు సమర్పించారు. కొంతమంది డ్రగ్స్ సరఫరాదారులకు కూడా ఆర్యన్ ఖాన్ రెగ్యులర్ కస్టమర్ అని కోర్టుకు తెలిపింది. దీంతో అతడి రిమాండ్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది కోర్టు.
కోర్టు బెయిల్ నిరాకరించిన వెంటనే ఆర్యన్ ఖాన్ ను పోలీసులు, ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈనెల 3వ తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ అప్పట్నుంచి రిమాండ్ లోనే ఉన్నాడు.
నిజానికి ఈరోజు ఆర్యన్ కు బెయిల్ వస్తుందని షారూక్ దంపతులు భావించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ దగ్గర తమ సొంత వాహనాల్ని ఉంచారు. పూచికత్తు సమర్పించేందుకు, బెయిల్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా రాత్రిలోపు ఆర్యన్ ను ఇంటికి తీసుకెళ్లే విధంగా, వేగంగా ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు మరో ఇద్దరు లాయర్లను నియమించారు.
కానీ ఎన్సీబీ అధికారులు ఆఖరి నిమిషంలో కోర్టుకు సమర్పించిన ఆధారాలు బలంగా ఉండడంతో.. షారూక్ కు, ఆర్యన్ కు మరోసారి నిరాశ తప్పలేదు. మరోవైపు ఆర్యన్ ఖాన్ ఛాట్ చేసిన ఆ కాబోయే హీరోయిన్ ఎవరనే కోణంలో బాలీవుడ్ లో సరికొత్త చర్చ మొదలైంది.