కొత్త మలుపు తిరిగిన డ్రగ్స్ కేసు.. తెరపైకి నవదీప్

హైదరాబాద్ లో డ్రగ్స్ బయటపడిన ప్రతిసారి, టాలీవుడ్ లింక్స్ కూడా బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ తో టాలీవుడ్ కు ఉన్న లింక్స్ బహిర్గతమయ్యాయి. రీసెంట్ గా బయటపడిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా…

హైదరాబాద్ లో డ్రగ్స్ బయటపడిన ప్రతిసారి, టాలీవుడ్ లింక్స్ కూడా బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ తో టాలీవుడ్ కు ఉన్న లింక్స్ బహిర్గతమయ్యాయి. రీసెంట్ గా బయటపడిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా టాలీవుడ్ మూలాలు బయటకొచ్చాయి. ఈ విషయాల్ని సీపీ సీవీ ఆనంద్ స్వయంగా వెల్లడించారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తాజాగా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు, రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లు ఉన్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న వ్యక్తుల్లో నటుడు నవదీప్ కూడా ఉన్నట్టు వెల్లడించారు సీవీ ఆనంద్.

“పక్కా ఆధారాలతో నిఘా పెట్టాం. దేవరకొండ సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. మాజీ ఎంపీ విఠల్ రావు కొడుకు ఈయన. ఇతడు కొకైన్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇక సుశాంత్ రెడ్డి అనే దర్శకుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. వీళ్లతో పాటు కొర్రపాటి సందీప్, ప్రణీత్ అనే వ్యక్తుని అరెస్ట్ చేశాం. తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమందిని పట్టుకోలేకపోయాం, ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఫోన్లు స్విచాఫ్ చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి మాయమయ్యారు. కేఫ్ ఓనవర్లు అర్జున్, రవి ఉప్పలపాటి, నటుడు నవదీప్, శ్వేత, కార్తీక్.. ఇలా 8 మంది పరారీలో ఉన్నారు. మా టీమ్స్ వాళ్లను వెంటాడుతున్నాయి.”

ఇలా మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరును అధికారికంగా ప్రకటించారు సీవీ ఆనంద్. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రామ్ చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు నవదీప్ ఫ్రెండ్. నవదీప్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని అతడు అందించినట్టు ఆనంద్ తెలిపారు. ఇతడితో పాటు.. ఇప్పటికే అరెస్ట్ అయిన వెంకటరత్నా రెడ్డి అనే వ్యక్తి కూడా 18 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు అంగీకరించాడని, అందులో కూడా నవదీప్ పేరు ఉందని అన్నారు.

'బేబి'పై ఫైర్ అయిన సీపీ

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినట్టు వెల్లడించారు సీవీ ఆనంద్. ఈ సందర్భంగా బేబి సినిమాపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బేబి సినిమాలో డ్రగ్స్ తీసుకున్న సన్నివేశాల్ని పబ్లిక్ గా చూపించారని, యువతను ప్రోత్సహించే విధంగా ఆ సన్నివేశాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ సినిమా దర్శకుడు-నిర్మాతకు ఎడ్వయిజరీ నోటీసులిస్తామని స్పష్టం చేశారు.

సాయిరాజేష్ రెస్పాన్స్

పోలీసులు తనను పిలిచిన విషయాన్ని నిర్థారించాడు దర్శకుడు సాయిరాజేష్. మాదక ద్రవ్యాల సన్నివేశాల్ని నేరుగా చూపించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెప్పుకొచ్చాడు. అయితే తనకు నోటీసులు ఇవ్వలేదని, కేవలం కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చారని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు చెప్పుకొచ్చాడు.

బేబి సినిమాలో కథ ప్రకారం హీరోయిన్ పక్కదోవ తప్పుతుంది. చెడు సావాసాల వల్ల ఓ దశలో మాదక ద్రవ్యాలు కూడా తీసుకుంటుంది. థియేటర్లలో బేబి సినిమా రన్ ముగిసింది. తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ సన్నివేశాల్ని తొలిగించడం సాధ్యంకాదని సాయిరాజేష్ స్పష్టం చేశాడు. సెన్సార్ పూర్తయిన కంటెంట్ నుంచి తొలిగించడం లేదా జతచేయడం లాంటివి చేయలేమన్నారు. అలాంటి సన్నివేశాలు తీయడంలో తను బాధ్యతగా వ్యవహరిస్తానని, కథకు ఆమాత్రం అవసరం కాబట్టి చూపించాల్సి వచ్చిందని తెలిపాడు.

నేను అందుబాటులోనే ఉన్నాను.. నవదీప్

మరోవైపు ఈ కేసుపై నటుడు నవదీప్ కూడా స్పందించాడు. సీవీ ఆనంద్ చెప్పినట్టు తను పరారీలో లేనని, అందుబాటులోనే ఉన్నానని తెలిపాడు. తను హైదరాబాద్ లోనే ఉన్నానని కూడా స్పష్టం చేశాడు. తాజా ఘటనతో టాలీవుడ్ కు, మాదక ద్రవ్యాలతో ఉన్న లింకులు మరోసారి బయటపడినట్టయింది. అయితే ఈసారి పోలీసులు మరింత సీరియస్ గా ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, డ్రగ్స్ సరఫరా, వాడకం రోజురోజుకు పెరుగుతోందని, ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు.