పవన్ కి గాజువాక రియాక్షన్

పవన్ ఆవేశంగా ప్రకటించారో లేక ఆలోచన చేసి ప్రకటించారో కానీ 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీతోనే పొత్తు అని పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఏడున్నర పదుల వయసులో ఉన్న చంద్రబాబు జైలులో ఉన్నారని తోటి…

పవన్ ఆవేశంగా ప్రకటించారో లేక ఆలోచన చేసి ప్రకటించారో కానీ 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీతోనే పొత్తు అని పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఏడున్నర పదుల వయసులో ఉన్న చంద్రబాబు జైలులో ఉన్నారని తోటి రాజకీయ పక్షంగా పవన్ పరామర్శకు వచ్చారని అంతా అనుకున్నారు జైలు బయటే పొత్తు ప్రకటన చేసి పవన్ చాలా మందికి ఆశ్చర్యపరచారు. దీని మీద రెండు పార్టీల క్యాడర్ లో చర్చ సాగుతోంది. వైసీపీ అయితే ఇదంతా చాలా కాలం నుంచే సాగుతోంది అంటోంది.

పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక నుంచి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, పవన్ ని ఓడించి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అయితే ఘాటు అయిన రియాక్షన్ ఇచ్చారు. ఇంతకాలం ముసుగు వేసుకుని వున్న పవన్ ఈ రోజు ముసుగు తీశారని అన్నారు. అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు దోచుకున్న తీరు ప్రజలకు తెలుసు. అలా రెడ్ హ్యాండెడ్ గా దోపిడీ తో చంద్రబాబు దొరికితే  ఆయన్ని సమర్ధించడం ద్వారా పవన్ తన నైజం బయట పెట్టుకున్నారని తిప్పల నాగిరెడ్డి ఫైర్ అయ్యారు

మామూలుగా రాజకీయ చరిత్రలో చూస్తే ఏదైనా పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందన్నది తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు గెలుపు కోసం తాపత్రయ పడుతున్నారని తిప్పల నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ గత నాలుగున్నరేళ్ళుగా తనకు ఓటేసిన గాజువాక ప్రజల్ని పట్టించుకోని నాయకుడుగా ఉన్నారని ఇపుడు ఆయన కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు.

టిడిపితో జనసేన పొత్తు ప్రకటన వల్ల ఆ పార్టీ కార్యకర్తల్లో నిరాశ కలిగిందని తిప్పల తెలిపారు. కేవలం చంద్రబాబు దయా దాక్షిణ్యలతో  ఇచ్చే ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేయాలని పవన్  తపన పడటం దారుణం అన్నారు. అయినా ఎవరైనా ఎక్కడైనా పరామర్శకు వెళ్తారు కానీ అలా  జైలుకు వెళ్లి పొత్తు ప్రకటించడం ఏమిటో చిత్రంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు వేశారు. ఇలాంటి పొత్తులు జైలు బయట పొత్తులు అక్రమమే కాదు అనైతికమని అన్నారు. వీటిని ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారు అని ఆయన జోస్యం చెప్పారు.