టాలీవుడ్ లో నిర్మాతల మండలి ఉంది. కోలీవుడ్ లో కూడా నిర్మాతల మండలి ఉంది. కానీ ఈ రెండు మండళ్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తమిళ చిత్రసీమలో నిర్మాతల మండలి కన్నెర్రచేస్తే, ఎంత పెద్ద హీరో అయినా వెనకడుగు వేయాల్సిందే. మరీ ముఖ్యంగా అక్కడ 'రెడ్ కార్డు' సంస్కృతి ఉంది.
నటీనటుల్లో ఎవరికైనా నిర్మాతల మండలి రెడ్ కార్డు జారీ చేస్తే, అది వాళ్లకు వార్నింగ్ బెల్ కింద లెక్క. ఇంతకీ ఈ రెడ్ కార్డ్ అంటే ఏంటి? ఇది అందుకున్న నటీనటులు ఏం చేయాలి? రెడ్ కార్డ్ అందుకున్న తర్వాత కూడా వ్యవహార శైలి మారకపోతే, మండలి ఏం చేస్తుంది?
రెడ్ కార్డ్ అనేది కోలీవుడ్ లో హెచ్చరికలాంటిది. ఇది జారీ చేస్తే నటీనటులు ఇబ్బందుల్లో పడినట్టే. రెడ్ కార్డ్ అందుకున్న నటుడు, నిర్మాతల మండలి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు మరో ప్రొడ్యూసర్ తో సినిమా చేయలేడు. నటీనటులు తమ బకాయిల్ని క్లియర్ చేసేంత వరకు లేదా నిర్మాతలతో ఉన్న ఏదైనా సమస్యను పరిష్కరించుకోనంతవరకు ఈ రెడ్ కార్డు అమల్లో ఉంటుంది.
రెడ్ కార్డ్ అందుకున్న నటీనటులెవ్వరూ, అది క్లియర్ చేసుకునేంతవరకు మరో తమిళ సినిమాలో నటించడానికి అనుమతివ్వరు. ఇలా నటీనటుల కెరీర్ పై రెడ్ కార్డ్ తీవ్ర ప్రభావం చూపుతుంది.
అన్నింటికీ మించి కోలీవుడ్ లో రెడ్ కార్డ్ అనేది ప్రతిష్టతో ముడిపడిన అంశం. ఓ నటుడు లేదా నటి రెడ్ కార్డ్ అందుకుంటే, అది అతడు/అమె గౌరవానికి భంగం. ఇప్పుడు ధనుష్, విశాల్, అధర్వ, శింబు.. వేర్వేరు కారణాల వల్ల నిర్మాతల మండలి నుంచి ఈ రెడ్ కార్డులు అందుకోబోతున్నారు.
వీళ్ల కంటే ముందు ఎస్ జే సూర్య, యోగిబాబు కూడా నిర్మాతల మండలి నుంచి రెడ్ కార్డులు అందుకున్నారు. సినిమాల షూటింగ్స్ సకాలంలో పూర్తికాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వీళ్లను మండలి హెచ్చరించింది. ఆ సమస్య నుంచి వాళ్లు సక్సెస్ ఫుల్ గా బయటపడ్డారు. ఇప్పుడు ధనుష్, విశాల్, అధర్వ, శింబు వంతు వచ్చింది.
విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై రెడ్ కార్డు ప్రభావం లేదు. ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమాపై మాత్రం రెడ్ కార్డ్ ప్రభావం పడుతుంది. ఈలోగా అతడు తన సమస్యల్ని పరిష్కరించుకుంటే బెటర్.