నటులు శ్రీరెడ్డి, కరాటే కళ్యాణి మధ్య నడుస్తున్న కేసులో సాక్షిగా ఉన్నందుకు ఓ డ్యాన్స్ మాస్టర్ నలిగిపోవాల్సి వచ్చింది. తనను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు…తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చెన్నైకి ప్రత్యేక బృందం వెళ్లి శ్రీరెడ్డికి నోటీసులు అందించింది.
ఇదే విధంగా 2018లో ఓ చానల్లో జరిగిన డిబేట్లో తనను దూషించిన కళ్యాణిపై శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కళ్యాణికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో వారిద్దరికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
తాజాగా ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ డ్యాన్స్ మాస్టర్ ఊహించని చిక్కుల్లో పడ్డాడు. తనకే మాత్రం సంబంధం లేకుండా ట్రోల్స్‌కు గురవుతున్నాడు. సదరు డ్యాన్స్ మాస్టర్ ఓ యూ ట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో చూసిన మేటి డ్యాన్సర్ అంటూ ఓ యువ హీరో పేరు చెప్పాడు. దీన్ని చూసిన మరో యువహీరో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది.
ఆ డ్యాన్స్ మాస్టర్ పని పట్టాలని ఆ హీరో అభిమానులు డిసైడ్ అయ్యారు. డ్యాన్సు యూనిట్ ఏర్పాటు కోసం సదరు డ్యాన్స్ మాస్టర్ తన సెల్ నంబర్‌ను సోషల్‌మీడియాలో పెట్టి ఉండటంతో….ఆ హీరో అభిమానుల పని సులువైంది. ఆ సెల్ నంబర్‌కు ఫోన్ చేస్తూ సదరు అభిమానులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసిన ఆయన శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక హీరోని పొగిడితే, ఇంకో హీరో అభిమానులకు కోపం రావడం ఏంటో అర్థం కాక సదరు డ్యాన్స్ మాస్టర్ జుట్టు పీక్కుంటున్నాడు.