అంబానీ వినతిని జగన్ మన్నించినట్లే!

ముఖేష్ అంబానీ కొన్నిరోజుల కిందట అమరావతికి వచ్చే జగన్‌ను కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. పరిమల్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించడం కోసమే అంబానీ జగన్ వద్దకు వచ్చి ఆబ్లిగేషన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.…

ముఖేష్ అంబానీ కొన్నిరోజుల కిందట అమరావతికి వచ్చే జగన్‌ను కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. పరిమల్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించడం కోసమే అంబానీ జగన్ వద్దకు వచ్చి ఆబ్లిగేషన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి.. అంబానీ విజ్ఞప్తిని జగన్మోహనరెడ్డి గౌరవించినట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తమ పార్టీకి దక్కగల నాలుగు ఎంపీ స్థానాల్లో ఒకదానిని అంబానీకోసం త్యాగం చేయడానికే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

పరిమల్ నత్వానీ.. అంబానీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో జార్ఖండ్ నుంచి ఇండిపెండెంట్ గా ఆయన రాజ్యసభలో ప్రవేశించారు. ఇప్పుడు పదవీకాలం పూర్తవుతుండడంతో.. అంబానీ ఆబ్లిగేషన్ జగన్ వద్దకు చేరింది. రాష్ట్రంలో దక్కే మొత్తం నాలుగు సీట్లను ఏకపక్షంగా తమ పార్టీకే దక్కించుకునే ఆధిక్యంతో వైకాపా ఉంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, పరిమల్ నత్వానీ కొన్ని రోజుల కిందట వచ్చి జగన్ ను కలిశారు.

ఆ సమయంలో.. తమ పార్టీలో  బయటివారికి రాజ్యసభ ఎంపీ టికెట్ ఇచ్చే సంస్కృతి లేదని జగన్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీ పార్లమెంటు లాబీల్లో నత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. తన ఎంపీ సీటు గురించి జగన్ ను అంబానీ అడిగిన విషయాన్ని ధ్రువీకరించారు. జగన్ అప్పటికప్పుడు తేల్చకుండా… రెండు మూడు రోజుల్లో అభిప్రాయం చెబుతానని అన్నట్లుగా కూడా ఆయన మీడియాతో చెప్పారు.

అయితే తాజాగా జగన్ నత్వానీ అభ్యర్థిత్వానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవధిలో జగన్ పార్టీలోని సీనియర్లతోను, రాజ్యసభ టికెట్ కోరుకుంటున్న ఆశావహులతోను మాట్లాడి వారిని ఒప్పించినట్లుగా తెలుస్తోంది. నలుగురు ఎంపీల్లో రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి పేరు ఇప్పటికే ఖరారైంది. ఆయన నామినేషన్ పత్రాలు కూడా తీసుకున్నారు. పార్టీ ప్రస్తుతం రెండు పేర్ల మీదే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్ తదితరులు పేర్లు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ నా ప్రాణస్నేహితుడు

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా స్టోరీ ఇదే