ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి కార్పొరేషన్‌లో బీసీలకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు అభినయ్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో తిరుపతి కార్పొరేషన్‌కు 12 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. ఈ దఫా ఎలాగైనా తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించి, ఆధ్యాత్మిక నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే భూమనతో పాటు ఆయన తనయుడు అభియన్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ పరిధిలో చురుకైన పాత్ర పోషించిన అభినయ్‌కి, ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను కూడా ఎమ్మెల్యే అప్పగించాడు. దీంతో ఎంతో ముందుగానే తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై తండ్రి సూచనలు, సలహాలతో అభినయ్ సీరియస్‌గా కసరత్తు చేపట్టాడు.
మొదటి నుంచి వైసీపీ బలోపేతానికి కృషి చేసిన స్థానిక నాయకులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే సీఎం జగన్ సామాజిక వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. తిరుపతిలో ముఖ్యంగా బలిజ, యాదవుల తర్వాత రెడ్డి, కమ్మ, ఎస్సీ, మైనార్టీ , ఎస్టీ ఓటర్లు ఉన్నారు. రాజకీయాల్లో వ్యూహ రచన చేయడంలో తండ్రికి మించిన తనయుడిగా అభినయ్ చిన్నవయసులోనే పేరు పొందాడు.
అందుకే తగ్గట్టుగానే మేయర్ అభ్యర్థి విషయంలో ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవడమే నిదర్శనంగా తిరుపతి వాసులు చెబుతున్నారు. తిరుపతి కార్పొరేషన్ ఒకవేళ రిజర్వేషన్‌లో జనరల్‌కు కేటాయించినా… బీసీ అభ్యర్థికే పట్టం కట్టాలని అభినయ్ తన తండ్రికి సూచించినట్టు సమాచారం. తనయుడి సామాజిక దూర దృష్టికి మెచ్చిన కరుణాకర్‌రెడ్డి కూడా అందుకు పచ్చ జెండా ఊపాడు.
దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే బీసీ సామాజిక వర్గంలోని యాదవులకు మేయర్ పదవి కట్టబెట్టాలని అధికారికంగా తిరుపతి వైసీపీ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో వైసీపీపై బీసీ సామాజికవర్గంలో ఎంతో సానుకూల దృక్పథం ఏర్పడింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రస్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం కూడా వైసీపీకి వారంతా బలమైన ఓటు బ్యాంకుగా మారడానికి దోహదం చేశాయని చెప్పొచ్చు.
ఏది ఏమైనా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌పై గొడవ జరుగుతున్న నేపథ్యంలో…ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసేందుకు ఎమ్మెల్యే భూమన , ఆయన తనయుడు అభినయ్ ఎంతో చొరవతో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా మేయర్ పదవిని కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా ఓ గొప్ప నిర్ణయమనే చెప్పాలి. ఈ విధమైన చొరవ మిగిలిన ప్రాంతాల్లో అన్ని పార్టీలు స్వచ్ఛందంగా తీసుకుంటే…రిజర్వేషన్లపై ఎలాంటి గొడవ పడనవసరం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.