నిజంగా టీడీపీ ధైర్యానికి సెల్యూట్ కొట్టాల్సిందే. ఒక వైపు కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లకే పరిమితం చేసినా …ఆ పార్టీ మళ్లీ నిలదొక్కుకునేందుకు చేస్తున్న పోరాటం అభినందనీయం. ఒక చానల్‌లో శనివారం ఉదయం జరిగిన మార్నింగ్ డిబేట్‌లో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాటలు వింటే ముచ్చటేసింది. ఆయన విసిరిన సవాల్‌కు సెల్యూట్ చేయాలనిపించింది.
డిబేట్ సమన్వయకర్త (యాంకర్) మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ నేత అహ్మద్‌పటేల్‌కు ఐటీ నోటీసులు అందాయని, భారీ మొత్తం (రూ.500కోట్లకు పైబడి)లో అందిన విరాళాలకు సంబంధించి వివరాలు చెప్పాల్సిందేనంటూ ఐటీ నోటీసులు ఇచ్చిందని తెలిపాడు. అయితే ఈ నోటీసులు ఇచ్చిన టైమింగ్ ఏంటంటే…ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ దాడులు జరిగిన తర్వాతే అని గుర్తించుకోవాలన్నాడు. అంతేకాదు, చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌తో పాటు టీడీపీ నాయకుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన తర్వాతే అహ్మద్‌పటేల్‌కు నోటీసులు వెళ్లాయన్నాడు. కాబట్టి ఇక్కడ దొరికిన సమాచారంతోనే అక్కడ నోటీసులు వెళ్లాయనే లాజిక్ ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందని, దీనిపై ఏం సమాధానం చెబుతారని యాంకర్ ప్రశ్నించాడు.
దీనిపై చర్చలో పాల్గొన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రంగా స్పందించాడు. ఆయన ఏమన్నారంటే…
“బీజేపీ నేత రామకోటయ్య, వైసీపీ నేత రాజశేఖర్ రెండు డేట్లను గుర్తు పెట్టుకోవాలి. ముందుగా రామకోటయ్య గుర్తు పెట్టుకోవాల్సిన డేట్ 16 మార్చి , 2018. ఏంటో తెలుసా ఆ డేట్. ఆ రోజున మేము ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చాం. మద్దతు ఉపసంహరించుకుని బయటికి వచ్చి మీపై పోరాటం స్టార్ట్ చేశాం. ఇవాళ్టికి 721వ రోజు. (మీరేమైనా దేశ భక్తులా అని బీజేపీ నేత అడ్డు తగిలారు). మీరు వినండి సార్. ఇతరులకు నీతులు చెప్పడం కాదు. చప్పట్లు కొట్టడం కాదు. మీరు కూడా ఇతరులు మాట్లాడేటప్పుడు వినడం అలవాటు చేసుకోండి. రాష్ట్రం కోసం మీపై యుద్ధం ప్రారంభించి 721 రోజులైంది. ఏం పీకగలిగారు మీరు. చంద్రబాబునాయుడు వెంట్రుక కూడా ముట్టుకోలేక పోయారు. 721 రోజుల తర్వాత కూడా ఇంకా ఏవో ఆరోపణలు చేస్తున్నారు. అన్నిరకాల అధికారాలు మీ చేతిలో పెట్టుకుని 721వ రోజు కూడా ఇంకా ఆరోపణలు చేస్తారా? దానికి అంతమేమీ ఉండదు. నిరూపించేది కూడా ఏమీ ఉండదు. నీతికి, నిజాయితీకి మారుపేరు చంద్రబాబునాయుడు ” అని పట్టాభి ఘాటుగా స్పందించాడు.
“ఇక వైసీపీ నేత రాజశేఖర్ గుర్తు పెట్టుకోవాల్సిన డేట్ మే 30- 2019. ఇవాళ్టికి 281వ రోజు. మీరు కూడా ఏమీ పీకలేకపోయారు. ఏవో చాలా పుస్తకాలు వేశారు. రూ.6 లక్షల కోట్లు అవినీతి అన్నారు. ఉపసంఘాలన్నారు. మంత్రుల ఉప సంఘాలన్నారు. మీరు రోజులు లెక్కపెట్టుకోండి. ఇంకా ఎన్ని సెంచరీలు కొడతారో కొట్టండి ” అని పట్టాభి సవాల్ విసిరాడు.
నిజానికి పట్టాభి సవాల్‌కు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, ఏపీలో తొమ్మిది నెలలుగా పాలన సాగిస్తున్న వైసీపీ నేతలు తమ తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాలి. ఎందుకంటే కేవలం ఆరోపణలతో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం చెలాయిస్తున్న రెండు పార్టీలు ఎంతో కాలం పబ్బం గడుపుకోలేవు. ఎందుకంటే టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్నట్టు చేతిలో అన్ని రకాల అధికారాలు పెట్టుకుని, కేవలం ఆరోపణలకు పరిమితమైతే ప్రజలు హర్షించరు.
మరోవైపు అధికార వైసీపీ సిట్, ఉప సంఘాల పేర్లతో హడావుడి చేస్తున్నప్పటికీ టీడీపీ ఏ మాత్రం భయపడకుండా సవాళ్లు విసురుతుండటాన్ని ప్రశంసించాల్సిందే. పట్టాభి సవాల్ విసరడంలో తామేమీ తప్పు చేయలేదనే ధీమా, ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఇప్పటికైనా బీజేపీ, వైసీపీలు ఒఠ్ఠి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టే ఆలోచనలు చేస్తే మంచిది.