సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షురాలిగాను, మాన్సాన్ ట్రస్టుకు అధ్యక్షురాలిగానూ కొత్తగా బాధ్యతలు తీసుకున్న సంచయిత గజపతి రాజు.. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? భారతీయ జనతా పార్టీలో మంచి గుర్తింపుతో.. బిజెవైఎం కేంద్ర కమిటీలో ఉన్న ఆమె.. కమలదళానికి రాం రాం చెప్పేసి.. జగన్ దళంలో పనిచేయనున్నారా? రాజకీయ పరిణామాలు, తాజా సమీకరణలు.. ఊహాగానాలు అన్నీ అవుననే అంటున్నాయి.
విజయనగరం సంస్థానానికి వారసుడిగా గతంలో ఆనందగజపతి రాజు గతంలో ఇప్పుడు సంచయిత చేపట్టిన రెండు బాధ్యతలనూ తానే నిర్వహిస్తూ వచ్చారు. ఆయన తదనంతరం అశోక్ గజపతిరాజు ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆనందగజపతి రాజు భార్య ఉమ ఆయన బతికిఉండగానే విడాకులు తీసుకున్నారు. ఆమె కూతురు ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న సంచయిత.
అశోక్ గజపతి రాజు కుటుంబంతో సత్సంబంధాలు లేని సంచయిత.. భాజపాలో కొంతకాలంగా పనిచేస్తున్నారు. బీజేవైఎం నాయకురాలిగా ఉన్నారు. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుగ్రహంతో.. ఈ పదవులను దక్కించుకున్నారు. భాజపాలో ఉన్నంతమాత్రాన పదవి ఇవ్వకూడదనేం లేదు. కానీ… రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద భాజపా దండయాత్ర చేస్తుండగా.. వారి ప్రాపకంతో సంచయిత పదవులు తీసుకుంది. పైగా కనీసం రాష్ట్ర భాజపా నాయకులకు సమాచారం కూడా లేకుండా, వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికివెళ్లి వారితో కలిసి వెళ్లి ప్రమాణస్వీకారం చేసేశారు. ఇదంతా వైకాపా ప్రాపకం లేకుండా జరిగే పని కాదు.
ఆమె మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా.. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కేంద్ర కమిటీకి ఉత్తరం రాశారు. అప్పుడే కమల దళాల సోషల్ మీడియా సారథులు.. సంచయితను పార్టీనుంచి అప్పుడే సస్పెండ్ చేసినట్లుగా ప్రచారం కూడా ప్రారంభించేశారు. అది అసలు జరిగినా జరగకపోయినా.. సంచయిత త్వరలోనే భాజపానుంచి బయటకు వస్తుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.