ఒకే ఫ్యామిలీ హీరోలు ఒకే సందర్భంలో తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి వెనుకాడుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు తప్పక కొన్ని సినిమాలు ఒకేసారి విడుదల అవుతూ ఉంటాయి. నాలుగేళ్ల కిందట బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. అది కూడా సంక్రాంతి సీజన్లో. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు దక్కకుండా గట్టినే కృషి చేశారు. తారక్ కు పెద్ద ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న మండల కేంద్రాల్లోనే కొన్ని చోట్ల అతడి సినిమాకు థియేటర్లు దక్కలేదు. టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో తారక్ సినిమాను తొక్కేయడం నారా లోకేష్ కు సులువయ్యిందని అంటారు.
అంత చేసినా.. అప్పుడు తారక్ హిట్ ను డెలివర్ చేయగలిగాడు. అదే నాన్నకు ప్రేమతో. ఆ సంగతలా ఉంటే.. తమిళనాట కూడా పొంగల్ సీజన్ పెద్ద సినిమాలకు సీజన్. ఈ క్రమంలో అక్కడ భారీ సినిమాలు విడుదల అయ్యాయి. వాటిల్లో ఒకటి రజనీకాంత్ దర్బార్, మరొకటి అతడి అల్లుడు ధనుష్ సినిమా పట్టాస్. దర్బార్ ను తమిళ్ క్రిటిక్స్ కూడా చెండాడారు. సినిమాలోని లోటు పాట్లను ఎంచారు. అయితే ఆ సినిమా కలెక్షన్లను మాత్రం రాబట్టుకుంటూ ఉందట! అయితే మంచి సినిమాగా మాత్రం అది నిలవలేకపోతోంది.
ఆ సంగతలా ఉంటే.. దర్బార్ కన్నా తక్కువ స్థాయి రేటింగులు, ఎక్కువ విమర్శలు పొందుతూ ఉంది ధనుష్ సినిమా పట్టాస్. ఇదో రొటీన్ మాస్ మసాలా అని అక్కడి క్రిటిక్స్ అంటున్నారు. అసురన్ తర్వాత ధనుష్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసిన దానికీ, ఈ సినిమాకూ ఏ మాత్రం సంబంధం లేదని వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా మామా,అల్లుళ్ల సినిమాలు రెండూ సంక్రాంతి సీజన్లోనే వచ్చి.. నెగిటివ్ టాక్ పొందుతున్నట్టున్నాయి.