cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

పార్టీ భారం దించుకున్న పవన్

పార్టీ భారం దించుకున్న పవన్

మొత్తానికి సినిమాలు చేయడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వున్నాయి. వంద కోట్ల రూపాయలు పవన్ కు పారితోషికంగా రావడానికి సిద్దంగా వున్నాయి. కానీ జనసేన అనే పార్టీ ఆయనకు అతి పెద్ద బాధ్యతగా కాళ్లకు అడ్డం పడుతోంది. 

వాస్తవానికి సినిమాలు మానేయమని పవన్ ను ఎవ్వరూ కోరలేదు? ఎవ్వరూ డిమాండ్ చేయలేదు. తానే ఏదో అరి వీర భయంకర త్యాగం చేస్తున్నట్లు గా వందల కోట్ల ఆదాయం, కెరీర్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేసా అని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు ఇంకో నాలుగేళ్లు టైమ్ వుంది ఎన్నికలకు. అదృష్టం బాగుంటే కనీసం అయిదారు సినిమాలు చేసుకునేంత టైమ్. రెండు వందల కోట్లకు పైగా ఆదాయం. అందుకే ఆ దిశగా దృష్టి పెట్టారు పవన్. కానీ పార్టీ సంగతేమిటి? ప్రజా ఉద్యమాల నిర్మాణం సంగతేమిటి? జనాలు రాజకీయాలు వదిలేసారు అంటే సమాదానం ఏమిటి? 

ఇది ఒక సమస్య.

ఇంకో సమస్య కూడా వుంది. తెలుగుదేశం వ్యవహారాలను జనం పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ ఉద్యమాలను జనం ఓరకంట కూడా చూడడం లేదు. ఎన్నికల ముందు నానా తిట్లు తిట్టడంతో చంద్రబాబును కూడా ఆయన పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కిలోమీటర్ల దూరంలో వుంచింది. కానీ భారతీయ జనతా పార్టీ అండలేకుండా చేయగలిగింది లేదు. సాధించగలిగిందీ లేదు. కానీ భాజపాను దగ్గరకు చేర్చుకోవాలి. దగ్గరకు చేర్చుకోవడం కన్నా, వైకాపాకు దూరం చేయాలి అది మరీ కీలకం.

ఇది రెండో సమస్య.

ఈ రెండు పక్షులను ఒకే తూటాతో పరిష్కరించే ప్రయత్నమే జనసేన-భాజపా అవగాహన. నిజానికి భాజపాకు తేదేపా కన్నా ముందు దగ్గరయింది జనసేననే. తిరుపతి మీటింగ్ లో మోడీ దగ్గరే కూర్చున్నారు. అలా తెలుగుదేశం పార్టీకి కూడా దగ్గరయ్యారు. ఉత్తరోత్తరా, భాజపాను వదిలేసి తెలుగుదేశంతోనే ముందుకు వెళ్లారు. కానీ ఎన్నికల ముందు ఆ పార్టీని వదిలేసి ఒంటరి పోరు చేసారు. 

వీటన్నింటికీ పెద్దగా లాజిక్కలు వెదకక్కర్లా. పవన్ దగ్గర, పవన్ నిర్ణయాలకు అలాంటివి ఏవీ వుండవు. తెలుగుదేశం పార్టీకి భాజపాకు నప్పలేదు. అందుకే ఆయన అప్పట్లో భాజపాను వదిలేసారు. తేదేపా-జనసేన విడిగా పోటీ చేస్తే బెటర్ అన్న ఆలోచనలు ఇరుపక్షాల్లో కీలకంగా సాగాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తను తీసుకోవాలనుకున్నారు. తేదేపాను వదిలారు.

కానీ ఎన్నికల తరువాత వీలయినంతగా తెలుగుదేశం స్వరాన్నే వినిపిస్తూ వస్తున్నారు. కానీ సమస్య అది కాదు, భాజపా మద్దతు లేకపోతేనే వైకాపా ఇరుకున పడుతుంది. అందువల్ల అట్నుంచి నరుక్కు రావాలి అనుకున్నారు. అలా అని తేదేపా నేరుగా భాజపాకు దగ్గర కాలేదు. ఇక మిగిలింది వయామీడియా వ్యవహారం. అందుకే జనసేన మళ్లీ భాజపా తలుపు తట్టింది. అయితే అలా అని భాజపా లో విలీనం చేయలేదు. విలీనం చేస్తే ఇక మరో ప్రజారాజ్యం అయిపోతుంది. అందుకే ఈ అవగాహన పోటీ.

నీకూ నీవారు లేరు, నాకు నా వారు లేరు అన్నట్లుగా భాజపాకు కింది స్థాయిలో నాయకులు, కార్యకర్తలు లేరు, జనసేనకు పార్టీ నిర్మాణం లేదు. ఈ రెండూ కలిసి ఏ విధంగా పోటీ చేసి, ఏం సాధిస్తాయి. రెండూ కలిసి తెలుగుదేశం పార్టీకి బ్యాకెండ్ లో నిలబడడం తప్ప? ఎడమొహం పెడమొహంగా వున్న తేదేపా-భాజపాల మధ్య మధ్యవర్తిగా పవన్ వుంటారు.

జనసేన బ్యానర్లు కట్టి, భాజపా అండంతో ఉద్యమాలు అంటారు. ఆయన సినిమాలు ఆయన చేసుకునేందుకు వీలవుతుంది. పార్టీ పోరాట వ్యవహారాలు భాజపాకు తాత్కాలికంగా పవర్ ఆప్ అటార్నీ అన్నట్లు అందిస్తారు. అంతకు మించి మరేమీ కాదు.

భాజపా ఒకందుకు పోస్తుంది..జనసేన ఒకందుకు తాగుతుంది. జనసేన ఒకందుకు పోస్తుంది. భాజపా ఒకందుకు తాగుతుంది. ఎవరి స్వంత అజెండాలు వారికి వెనకాల ఒరిజినల్ గా అలాగే వున్నాయి. ఇదంతా పైపైన షో వ్యవహారం తప్ప వేరు కాదు.నాలుగున్నరేళ్లు కాలక్షేపం చేయాలిగా?