తెలుగుదేశం పార్టీ చచ్చీ చెడీ 2019 ఎన్నికల్లో గెలిచిందే 23 సీట్లు. అందులో కూడా రెండు సీట్లు తగ్గించి చెబుతున్నారు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు సహా ఆయన ఎమ్మెల్యేలు 21 మందీ రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే తాము మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకుంటామంటూ మంత్రి సవాల్ చేశారు.
మూడు రాజధానుల అంశం మీద అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు జగన్ వెళ్ళాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ కి ఇది ప్రతి సవాల్ అన్న మాట. ఈ సవాల్ లో ఇద్దరు టీడీపీ తమ్ముళ్ళను తప్పించేసారు.
వారిలో ఒకరు గుంటూర్ వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి అయితే, మరొకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ ఇద్దరూ పసుపు శిబిరంలో లేరని బాబుకు కూడా క్లారిటీగా ఉండడంతోనే మంత్రి గారు పక్కన పెట్టేసినట్లున్నారని అంటున్నారు.
ఇక బాబుతో సహా అందరూ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా అని అవంతి వేసిన ప్రశ్నలకు ఇపుడు టీడీపీ అధినేత జవాబు చెప్పాల్సి ఉంది.
నిజమే కదా 151 మందిని రాజీనామా అడగడం కంటే అమరావతి రెఫరెండంగా చేసుకుని బాబే తమ పార్టీ ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాలకు సిధ్ధం కావచ్చుగా అంటున్నారు మంత్రి.
బాబు రెండు జిల్లాల పార్టీ నాయకుడిగా మిగిలిపోయారని కూడా అయన అంటున్నారు. చిత్రమేంటంటే ఆ రెండు జిల్లాల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికి జారిపోయారు మరి. మరింత ఆలస్యం చేస్తే సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా జారిపోతారేమోనని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
అపుడు 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న సవాల్ కూడా అవసరం కూడా ఉండదేమోనని అంటున్నారు. ఇక విశాఖ అభివ్రుధ్ధికి అడ్డుపడుతున్న బాబు అండ్ కో కు తాము రాజీనామాలు చేస్తే అసలు సంగతి తెలుస్తుందని కూడా అవంతి చేస్తున్న ఈ సవాల్ మింగుడుపడుతుందా.