వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హీరో దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. తాజాగా జరిగిన 2 ఘటనలు ఆయన్ను మరింత ఇరకాటంలోకి నెట్టాయి.
రేణుకాస్వామి కిడ్నాప్ జరిగిన తర్వాత హీరో దర్శన్ ఆనందంతో పార్టీ చేసుకున్నాడట. బెంగళూరులోని ఓ పబ్ లో అతడు ఫుల్ గా ఎంజాయ్ చేశాడంట. ఆ తర్వాత అట్నుంచి అటు రేణుకాస్వామిని ఉంచిన షెడ్డుకు వెళ్లాడట దర్శన్.
కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే, రేణుకాస్వామి షెడ్డుకు దర్శన్ వెళ్లిన టైమ్ కు అక్కడే పవిత్ర గౌడ ఉన్నారట. అందుకే ఆమెను ఈ కేసులో ఏ-1గా చేర్చినట్టు కథనాలు వస్తున్నాయి.
మరోవైపు ఈ కేసును రీక్రియేట్ చేసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకాస్వామిని హత్య చేసిన తర్వాత ముగ్గురు నిందితుల దుస్తులపై రక్తపు మరకలు పడ్డాయి. వాళ్లు దుస్తులు మార్చుకునేందుకు సమీపంలోని రిలయన్స్ ట్రెండ్స్ దుకాణంలోకి వెళ్లారు. ఆ ఫూటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈ కేసుకు సంబంధించి మరో పెద్ద మలుపు ఏంటంటే, ఉన్నట్టుండి దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా దర్శన్ కు చెందిన ఫామ్ హౌజ్ లో. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌజ్ లో మేనేజర్ శ్రీధర్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ మేరకు అతడు ఓ లేఖ, ఓ వీడియోను కూడా విడిచిపెట్టాడు.
ఒంటరితనం వల్లనే తను చనిపోతున్నానని, విచారణ పేరిట తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఆ లేఖలో శ్రీధర్ కోరాడు. మేనేజర్ సూసైడ్ తో ఇప్పుడు దర్శన్ కు మరిన్ని తలనొప్పులు ఎదురయ్యాయి. మేనేజర్ ఆత్మహత్యకు, రేణుకాస్వామి హత్య కేసుకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాపు మొదలుపెట్టారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు ప్రస్తుతం చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి.