సమాజం ఎటు పోతోందో? సమాజాన్ని ఎటు మళ్లిస్తున్నారో ఈ బిగ్ బాస్ క్రియేటర్లు? టాస్క్ ల పేరిట చేస్తున్న, చేయిస్తున్న అరాచకాలు చూస్తుంటే, ఎంత అసహ్యం వేయాలో అంతా వేస్తోంది.
కేవలం బిగ్ బాస్ ఇచ్చే క్రేజ్ కోసమో లేదా క్యాష్ కోసమో కంటెంస్టెంట్స్ ఈ హింసను భరించడం చూస్తుంటే వీరికి ఆత్మాభిమానం వుందా? డబ్బుల కోసమో, పేరు కోసమో మరీ ఇంతకు దిగిపోవాలా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
నిన్నటి నిన్న కొందరు కంటెంస్టెంట్స్ ను గంటల కొద్దీ నిలబెట్టి, వారి ముఖాలు, తలల మీద నానా చెత్త వేయించి, పూయించి, వారిని నానా బాధ పెట్టారు. కంటెస్టెంట్ లు బాధతో విలవిలా ఏడవడం చూస్తుంటే వారి మీద జాలి పడాలో, లేదా వారిని అసహ్యించుకోవాలో అర్థం కాని పరిస్థితి.
ఇలాంటి టాస్క్ ల కారణంగా వారికి కళ్లు పోతే ఏమిటి పరిస్థితి? గేమ్ షో ల పేరిట వారిని అంతలా హింసకు గురి చేయాలా? కోర్టులు ఇలాంటివి సూ మోటోగా ఎందుకు తీసుకోవు. ర్యాగింగ్ అంటే ఇలాంటివే కదా? అది చట్ట విరుద్దం కదా? అలాంటి చర్యలు చేయించడం, వాటిని బాహాటంగా ప్రదర్శించడం, అవి చూసి కుర్రకారు ఇలాంటి పనులే తమ కాలేజీల్లో చేయడం. దీనంతటిని కోర్టులు అరికట్టాల్సివుంది కదా?
బిగ్ బాస్ ఏమిటీ దారుణం అని నిర్వాహకులను కానీ, మెంటార్ నాగార్జున ను కానీ అడగానికి ఎవ్వరికీ అవకాశం వుండదు. సోషల్ మీడియానే ఇలాంటి వ్యవహారాలను నిరసించే కార్యక్రమం చేపట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదు.
టీఆర్పీల పిచ్చితో, కోట్లు ఆర్జించడం కోసం చానెళ్లు కొన్ని లక్షలు కొందరికి ఆశచూపి, ఇలా నానా చెత్తతో కార్యక్రమాలు రూపొందించి జనాల మీద రుద్దే ప్రయత్నం చేసి, యువత మెదళ్లు కూడా ఖరాబు చేసే పనిలో పడ్డారు. ఇది ఎలా ఆగుతుందో? మరి?