Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో సహకరిస్తే ఇలా వుంటుంది

హీరో సహకరిస్తే ఇలా వుంటుంది

ఓ సినిమా జ‌నాలకు చేరువ కావాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. కానీ కేవలం డబ్బులు ఖర్చు చేసేస్తే రాదు. ఇప్పుడు సంప్రదాయ పబ్లిసిటీ విధానాలకు చెల్లు చీటీ పడుతోంది. ఏ సినిమాకు తగినట్లు ఆ సినిమాకు పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. మంచి సినిమాలు..కచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. ఈ విషయం జ‌నాల్లోకి వెళ్లాలి అంటే ముందుగానే ప్రీమియర్లు చకచకా వేసుకోవాల్సిందే. 

పెళ్లి చూపులు నుంచి రంగమార్తాండ వరకు చెబుతున్న సత్యం ఇదే. లేదూ ఓ రేంజ్ సినిమా, మంచి ఓపెనింగ్ రావాలంటే ముందుగా కంటెంట్ బయటపెట్టాల్సిందే అనుకుంటే సర్ మాదిరిగా ముందు రోజు ప్రీమియర్ వేసుకోవాల్సిందే. కంటెంట్ ను మూట కట్టి లాకర్లో దాచుకుంటాం అంటే నడవదు. భారీ సినిమాలు అయితే అది వేరే. అక్కడ పెద్దగా సమస్య వుండదు ఓపెనింగ్ కు.

ఇక పాన్ ఇండియా సినిమా అంటే రీచ్ రావడం మామూలు విషయం కాదు. కేవలం పాన్ ఇండియా విడుదల ప్లాన్ చేస్తే సరిపోదు. అక్కడి జ‌నాలకు మన హీరో చేరువ కావాలి. జ‌నానికి ఆసక్తి కలగాలి. దానికి టీవీ కమర్షియల్స్ నో, భారీ హోర్డింగ్ లో సరిపోవు. అంతకు మించి చేయాలి. ఇలా చేయాలంటే హీరో రంగంలోకి దిగాల్సిందే. ఇలా పాన్ ఇండియా సినిమాకు పబ్లిసిటీ కావాలంటే కనీసం నెల రోజులు అవసరం పడతాయి. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలు అని కాదు. కానీ మళ్లీ అక్కడ హొమ్ గ్రవుండ్ ను వదిలేయకూడదు. ఇక్కడ పని ఇక్కడా చేయాలి.

డియర్ కామ్రేడ్, లైగర్ విషయంలో విజ‌య్ దేవరకొండ అలాగే కాలికి బలపం కట్టుకుని తిరిగారు. రాజ‌మౌళి సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా దసరా సినిమాను నాని చేస్తున్నదీ అదే. విపరీతంగా తిరుగుతున్నారు. అయితే హోమ్ గ్రవుండ్ పరిస్థితి అన్నది తరువాత మాట్లాడదాం. ముందు పాన్ ఇండియా పబ్లిసిటీ మాత్రం అదరగొట్టి వదిలారు. ఎంత ఖర్చు అవుతోంది అన్నది తలచుకుంటే కాస్త బెదుర్స్ గానే వుంటుంది. కానీ మాస్ కు, పబ్లిక్ కు చేరవయ్యేలా పబ్లిసిటీ ప్లాన్ చేసిన తీరు బాగుంది. రాజ‌మౌళి సినిమాలకు పనిచేసిన ఏజెన్సీ ఈ పబ్లిసిటీని డిజైన్ చేసింది.

అక్కడి వాళ్లకే తెలుస్తుంది. ఏం చేస్తే లోకల్ మాస్ కు దగ్గర కావచ్చు అన్నది. కానీ ఎటొచ్చీ మన హీరోలు సహకరించాలి. మన హీరోలు ఇక్కడ మన బ్లూ సీ కో, సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్ కో వెళ్లి టీ తాగమంటే కష్టం కానీ, అక్కడ అనేసరికి అది కూడా పబ్లిసిటీ అని రెడీ అవుతారు. నాని గత మూడు నాలుగు రోజులుగా చేస్తున్నది అదే. ఓ స్టేట్ లో వడాపావ్, మరో స్టేట్ లో టీ, ఇంకో స్టేట్ లో ట్రాక్టర్ నడపడం ఇలా ఎక్కడకెయ్యది మేలు అన్నది తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు.

ఇప్పుడు కనుక ఇది ఫలించి దసరా సినిమాకు నార్త్ బెల్ట్ లో మంచి ఓపెనింగ్ ఇస్తే కనుక ఇకపై మన మిగిలిన హీరోలు కూడ ఫాలో..ఫాలో అనేయచ్చు. ఇకపై మన దగ్గర రానున్నవి అన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందువల్ల నార్త్ సిటీలు అన్నింటా మన హీరోల హల్ చల్ చేయడమే మిగిలింది. సదరు వీడియోలు ఫొటోలు షేర్ చేసుకుని ఆనందించడమే మన లోకల్ ఫ్యాన్స్ పని. ఎందుకంటే వాళ్లకు చేరువగా రావడం అన్నది అరుదు. మహా అయితే వందో, వెయ్యి మందినో పిలిచి ఫోటో సెషన్ పెట్టడం తప్ప ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి సుబ్బయ్య హోటల్ భోజ‌నమో, బాబాయ్ ఇడ్లీనో, గుంటూరులో బిరియానీనో తినడం సాధ్యం కాని పని కనుక.

మొత్తం మీద దసరా కు నార్త్ బెల్ట్ లో మంచి రీచ్ వచ్చింది. థాంక్స్ టు నాని ఇక ఇది ఓపెనింగ్ మాదిరిగా ఏ మేరకు కన్వెర్ట్ అవుతుందన్నది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?