ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆశల్ని ఆ నలుగురు వైసీపీ ప్రజాప్రతినిధులు వమ్ము చేయలేదు. ఆ నలుగురిపై నమ్మకంతోనే టీడీపీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ బరిలోకి దిగుతోందని “గ్రేట్ ఆంధ్ర ” ముందే చెప్పింది. ఈ నెల 12న గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో “టీడీపీ ఆశలన్నీ ఆ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపైన్నే!” శీర్షికతో కథనం వెలువడింది.
ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో ఆ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారని అధికార పార్టీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోని అసంతృప్తిని టీడీపీ సొమ్ము చేసుకోనుందని గ్రేట్ ఆంధ్ర రాసింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో పేర్లు రాయకపోయినా, సులువుగా అర్థం చేసుకునేలా వారికి సంబంధించి వివరాలను కథనంలో వెల్లడించాం. ఆ కథనంలోని ముఖ్య అంశాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
“రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కదనే నిర్ణయానికి వచ్చిన అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమకు ఓట్లు వేస్తారని టీడీపీ నమ్మకంగా వుంది. ఇప్పటికే నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరితో పాటు నెల్లూరు జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే, అలాగే రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా ఎమ్మెల్యే తమకు అండగా ఉంటారని టీడీపీ గట్టి నమ్మకంతో వుంది. నెల్లూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత జీవితంలో వివాదాలతో తరచూ రచ్చకెక్కుతున్నారు.
ఆయన వైఖరిపై సీఎం జగన్ తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలిసింది. అలాగే రాజధాని ప్రాంతంలోని ఒక మహిళా ఎమ్మెల్యే తీరుపై కూడా సీఎం ఆగ్రహంగా ఉన్నారు. సదరు ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సహ సమన్వయకర్తను కూడా నియమించిన సంగతి తెలిసిందే. వైసీపీకి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిస్తే, అంతే సంఖ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని దెబ్బకు దెబ్బ తీయాలని ప్రధాన ప్రతిపక్షం వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది”
వైసీపీలో టీడీపీకి అనుకూలంగా ఎవరున్నారో గ్రేట్ ఆంధ్ర పది రోజులు ముందే హెచ్చరించింది. అయినప్పటికీ కట్టడి చేసుకోవడంలో వైసీపీ నాయకత్వం విఫలమైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రస్తుతం అధికార పార్టీ లబోదిబోమంటోంది.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేశారని వైసీపీ నాయకత్వం ఓ నిర్ధారణకు వచ్చింది. తాడికొండకు అల్రెడీ శ్రీదేవిని కాదని ఇన్చార్జ్గా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడం వల్లే ఆమె అసంతృప్తికి కారణమైంది. ఇక మేకపాటి విషయానికి వస్తే రానున్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. దీంతో ఆయన తన కోపాన్ని ఈ విధంగా ప్రదర్శించారు. ఇక వారిపై చర్యలు తీసుకోడానికి ఏముంది? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.