ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో వైసీపీ షాక్‌లో వుంది. టీడీపీలో జోష్ పెరిగింది. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు పలికడం గమనార్హం. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుపై వైసీపీ వాదన ఆసక్తికరంగా వుంది. ఈ సంఖ్య తక్కువనేది వైసీపీ భావన.
ఇప్పటికే 30 మంది ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారని వైసీపీ పెద్దలు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో నలుగురు మినహాయించి మిగిలిన వారంతా అండగా నిలిచారనేది వైసీపీ వాదన.
వైసీపీని ధిక్కరించిన వారిలో ఇద్దరి గురించే చెప్పుకోవాలని, మరో ఇద్దరు టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
మీకు టికెట్లు ఇవ్వమని చెప్పినా, వారంతా పార్టీ వెంట నడవడం గొప్ప విషయంగా వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు. 150కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఎన్నికల ముంగిట కొంత మంది అసంతృప్తులు ఉండడం సహజమే అని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
అయితే టీడీపీ వాదన మరోలా వుంది. తమకు అవసరమైన మేరకే వైసీపీ మద్దతు తీసుకున్నామని, లేదంటే పెద్ద సంఖ్యలోనే అసంతృప్తవాదులు బయటపడేవాళ్లని టీడీపీ నేతలు అంటున్నారు. క్రాస్ ఓటింగ్‌పై టీడీపీ, వైసీపీ ఎవరి వాదనలు వారివి.