పల్లె అంటేనే నికార్సయిన మట్టి వాసన. అసలు సిసలైన ఆవేశకావేషాలు. అమాయకపు ప్రేమలు..ఉద్రేకపు వివాదాలు. ఇవన్నీ వెరసి దసరా సినిమా ట్రయిలర్ లోకి వచ్చేసాయి. హీరో నాని ఇంత రస్టిక్..రగ్డ్ సినిమా ఇప్పటి వరకు చేసి వుండలేదనే చెప్పాలి.
భీమిలి కబడ్డీ జట్టు నుంచి ఇప్పటి వరకు కొన్ని ప్రయత్నాలు అయితే చేసాడు కానీ సినిమా నేలబారుగా వుండి, ఎమోషన్లు ఆకాశాన్ని అంటే మూవీ మాత్రం చేయలేదనే చెప్పాలి. రెండు నిమిషాల 14 సెకెండ్ల దసరా ట్రయిలర్ మొత్తం పూర్తి ఎమోషనల్ గా, ఇంటెన్సివ్ కంటెంట్ తో సాగింది.
సింగరేణి బొగ్గుల గని నేపథ్యంలోని ఓ పల్లె జనాల కథగా దసరా సినిమా రూపొందించినట్లు కనిపిస్తోంది. కథ ఇదీ అని ట్రయిలర్ లో అయితే ఎటువంటి హింట్ ఇవ్వలేదు. కానీ కథనం ఏమిటి? దేని చుట్టూ తిరుగుతుంది? అన్న క్లారిటీ ఇచ్చారు. ట్రయిలర్ మొత్తం హీరో నాని చుట్టూ అతగాడి ఆవేశం, గొడవలు, కొట్లాటల చుట్టూ తిరిగింది.
ట్రయిలర్ లో రిలీఫ్ చూపించాలని దర్శకుడు అనుకోలేదు. కంటెంట్ మీద ప్రేక్షకులను ప్రిపేర్ చేయడానికే చూసాడు. ఇప్పటికే పాటలు రెండు బయటకు వచ్చాయి కనుక ట్రయిలర్ లో వాటిని ఇరికించి,కంటెంట్ ఫ్లో ను బ్రేక్ చేయాలని అస్సలు చూడలేదు. సినిమా పిక్చరైజేషన్ టోన్, నేపథ్యసంగీతం బాగున్నాయి. నిర్మాత చేసిన కోట్ల ఖర్చు కనిపిస్తోంది. కీర్తి సురేష్ పాత్ర కూడా ట్రయిలర్ లో లిమిటెడ్ గా కనిపించింది.