రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన జాతీయ ఉత్తమ నటుడు సంచారి విజయ్ (38) చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఈయన మరణంతో కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
జూన్ 12 రాత్రి విజయ్ స్నేహితుడిని కలిసి బైకుపై తిరిగి తన ఇంటికెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో ఆయన తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టిందని, ఆయనకు శస్త్రచికిత్స చేశామని, మరో 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. కానీ ఫలితం లేకపోయింది.
మృత్యువుతో పోరాటంలో ఆయన ఓడిపోయారు. చిత్ర పరిశ్రమ కుటుంబానికి, అభిమానులకు, ఆప్తులకు ఆయన తీరని దుఃఖాన్ని మిగిల్చారు. ఇదిలా ఉండగా తమ కుటుంబం ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు విజయ్ సోదరుడు సిద్దేశ్ వెల్లడించాడు.
2015లో విజయ్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. లాక్ డౌన్ టైంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించాడు. పరిశ్రమలోని కార్మికులకు తన వంతు సాయం అందించాడు.
మంచి నటుడితో పాటు చిన్న వయసులోనే మంచి మనిషిగా పేరు సంపాదించుకున్న సంచారి విజయ్ మరణవార్తను కన్నడ చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.