జగన్ సర్కార్ అనవసర విషయాలు నెత్తికెత్తుకుని అభాసుపాలవుతోంది. రాజకీయ కక్షతో నిబంధనలకు విరుద్ధంగా ముందు కెళుతూ న్యాయస్థానం చేతిలో పదేపదే మొట్టికాయలు తినాల్సి వస్తోంది. చివరికి చెడ్డపేరు మాత్రం జగన్ సర్కార్‌కే.
మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్‌పర్సన్ నియామకంలో జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ, తిరిగి మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతి రాజునే నియమిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్‌పర్సన్ సంచయితకు పదవి, జగన్ సర్కార్ పరువు పోయాయి.
విజయనగరం గజపతి రాజుల కుటుంబ వ్యవహారంలో తలదూర్చినందుకు జగన్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2020 మార్చిలో మాన్సాస్, సింహాచలం ట్రస్టులకు చైర్ పర్సన్‌గా సంచయిత గజపతిరాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమె ఆనంద గజపతిరాజు తనయ. మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు స్వయాన అన్న కూతురు. సంచయిత నియామకంతో అశోక్ గజపతిరాజు పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది.
వంశపారపర్యంగా వస్తున్న ట్రస్టు కావడంతో పాటు వయసులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలనే నిబంధనల మేరకు తన తొలగింపు, సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ట్రస్టులకు ఛైర్‌పర్సన్‌ను నియమించిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారమే నియమించామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేడు వెలువరించింది.
సంచయిత గజపతిరాజును చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.
సంచయిత నియామకం కంటే అశోక్ గజపతిరాజు తొలగింపే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.